
హసన్ పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అలివేలు మంగమ్మ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను హసన్ పర్తి, భీమారం గ్రామాల నుంచి రథాలపై ఊరేగింపుగా గుట్టపైకి చేర్చారు. భక్తులు దారివెంట నీళ్లు పోసి మంగళహారతులతో స్వాగతం పలికారు. అర్చకులు వేదాంత పార్ధాశారదచార్యులు, ఆరుట్ల శ్రీధర్ ఆచార్యులు ఉత్సవమూర్తులను కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వేడుకలకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
చింతగట్టుకు చెందిన మధ్య ప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాత్రి 11 గంటలకు స్వామి వారి కల్యాణం నిర్వహించారు. రాత్రి యాదవులు ఎండ్ల బండ్లు, మేకపోతులు రథాలతో అలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్, పిట్టల కుమారస్వామి ,పెద్దమ్మ శ్రీనివాస్, దాడి రాజు, పిట్టల ముక్తిశ్వర్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.