
- శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని ఎర్రవల్లి ముస్లింల డిమాండ్
- ముంపు కింద గ్రామాన్ని ఖాళీ చేయించిన గత సర్కార్
- అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి పట్టించుకోలేదని ఆవేదన
గజ్వేల్, వెలుగు: శ్మశాన వాటిక లేదని డెడ్ బాడీతో ఆర్డీఓ ఆఫీసు వద్ద ముస్లింలు నిరసన తెలిపారు. వెంటనే స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ఆర్అండ్ఆర్ కాలనీ ఎర్రవల్లి గ్రామానికి చెందిన ముస్లిం మహిళ నజియా శుక్రవారం మృతిచెందారు. సంప్రదాయం ప్రకారం ఆమె ను ఖననం చేసేందుకు ముస్లింలకు శ్మశాన వాటిక లేదు.
దీంతో వ్యాన్లో డెడ్ బాడీతో ఆర్డీవో ఆఫీసు వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు మాట్లాడుతూ.. తమ గ్రామమైన ఎర్రవల్లిని పునరావాసం కింద ఖాళీ చేయించేటప్పుడు అప్పటి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇస్తూ ఆర్అండ్ ఆర్ కాలనీకి తరలించిందని గుర్తుచేశారు. ఇప్పటికీ హామీలు నెరవేర్చకపోగా కనీసం శ్మశాన వాటిక కైనా స్థలం కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేండ్లుగా కలెక్టర్, ఆర్డీవో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. మృతి చెందిన వారిని ఎక్కడ ఖననం చేయాలో తెలియని ఇబ్బంది నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పని పరిస్థితుల్లో డెడ్ బాడీతో ఆర్డీఓ ఆఫీసు వద్ద నిరసన తెలపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా శ్మశానానికి స్థలం కేటాయించే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. గజ్వేల్ మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మతీన్ వెళ్లి మాట్లాడి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపారు. గజ్వేల్ టౌన్ లోని శ్మశానవాటికలో ఖననానికి అంగీకరించడంతో నిరసన విరమించారు.