ఎమ్మెల్సీ కవితను కలిసిన ఎరుకల సంఘం నాయకులు

ముషీరాబాద్, వెలుగు: ఎరుకుల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎరుకల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కోరారు. ఈ మేరకు శనివారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు నేతృత్వంలోని పలువురు ఎరుకల సంఘం ప్రతినిధులు ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న ఎరుకల కుటుంబాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరుకల ఎంపవర్ మెంట్ స్కీంను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఎరుకల కార్పొరేషన్ కు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.