మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ నుంచి తప్పించుకున్న ఒబాన్ అనే మగ చిరుతను అధికారులు విజయవంతంగా తీసుకువచ్చారు. ఐదు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 2న జాతీయ ఉద్యానవనం నుంచి తప్పించుకోవడంతో అటవీ అధికారులు వేట సాగించారు. ఆ తర్వాత తమ గ్రామంలో చిరుత సంచరిస్తోందని గుర్తించిన కొందరు గ్రామస్థులు.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ తర్వాత అటవీ అధికారులకు సమాచారం అందించారు. చివరకు చిరుత రాంపురాలో ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు... చిరుతకు ట్రాన్కిలైజర్ ఇచ్చి, తిరిగి కునో నేషనల్ పార్కుకు తిరిగి తీసుకువచ్చారు.
నమీబియా చిరుత ఒబాన్ ఏప్రిల్ 2 నుంచి తప్పించుకుని.. చుట్టు ప్రాంతాల్లో సంచరించింది. కునో నేషనల్ పార్కుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయ్ పూర్ ప్రాంతం కనిపించిందని గ్రామస్థులు వెల్లడించారు. ఆ తర్వాత పర్వాటీ బరోడా గ్రామంలో ఓ నదిలో నీరు తాగుతూ కనిపించిందంటూ సమాచారం వచ్చింది. చిరుత కదలికలను నిశితంగా పరిశీలించిన అధికారులు.. ఎట్టకేలకు ఎంతో నేర్పుతో దాన్ని పట్టుకున్నారు. నమీబియా నుంచి రెండు విడతలుగా 20 చిరుతలు భారతదేశానికి వచ్చాయి. 2022 సెప్టెంబర్ నెలలో ఎనిమిది చిరుతలను తీసుకురాగా.. 2023 ఫిబ్రవరిలో మరో 12 చిరుతలను తీసుకువచ్చారు.