
- 25 మీ. పిస్టల్ ఫైనల్లో స్టార్ షూటర్
- క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే హైదరాబాదీ ఇషా సింగ్ ఔట్
పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా పతకాల ఖాతా తెరిచి.. రెండో కాంస్యంతో డబుల్ ధమాకా మోగించి చరిత్ర సృష్టించిన ఇండియా పిస్టల్ క్వీన్ మను భాకర్.. దేశ క్రీడా చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని హ్యాట్రిక్ ఒలింపిక్ మెడల్ ముంగిట నిలిచింది. 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో జోరు ను కొనసాగించిన 22 ఏండ్ల ఈ ‘బుల్లెట్’ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లోనూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో రెండో స్థానం సాధిస్తూ ఫైనల్లో అడుగు పెట్టిన భాకర్ ఈసారి స్వర్ణం, రజతంపై ఆశలు రేపుతోంది. ఇదే ఈవెంట్‌లో పోటీపడ్డ హైదరాబాదీ ఇషా సింగ్ పిస్టల్ మిస్‌ఫైర్ అయింది. అటు బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ సెమీఫైనల్ చేరి చరిత్రకె క్కగా.. హాకీ టీమ్ ఒలింపిక్స్‌లో 52 ఏండ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించి ఔరా అనిపించింది. ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అద్భుత ఆటతో సెమీఫైనల్ చేరి ఆశలు రేపిన తెలుగు కుర్రాడు ధీరజ్, అంకిత సెమీస్‌తో పాటు కాంస్య పోరులోనూ ఓడి కొద్దిలో పతకం చేజార్చుకున్నారు.
పారిస్ : మిగతా ఆటల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నా ... భారీ అంచనాలున్న స్టార్లు బోల్తా కొడుతున్నా.. పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా షూటింగ్ టీమ్.. అందునా మను భాకర్ హవా నడుస్తోంది. ఇప్పటికే రెండు పతకాలతో మెప్పించిన మను మూడో మెడల్‌తో ఆ ఆనందాన్ని మూడింతలు చేసేందుకు సిద్ధమైంది.25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భాకర్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన ప్రెసిషన్, ర్యాపిడ్ రౌండ్ల క్వాలిఫికేషన్ దశలో మను మొత్తంగా 590 పాయింట్లతో రెండో స్థానం సాధించింది. హంగేరికి చెందిన వెరోనికా మేజర్ 592 స్కోరుతో ఒలింపిక్ రికార్డును సమం చేస్తూ అగ్రస్థానం కైవసం చేసుకుంది. కానీ, ఇదే ఈవెంట్‌లో పోటీపడ్డ ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ ఇషా సింగ్ 581 స్కోరుతో 18వ స్థానంతో సరిపెట్టి ఇంటిదారి పట్టింది. ఈ పోటీలో మొత్తం 40 మంది షూటర్లు బరిలో నిలవగా.. టాప్‌లో నిలిచిన ఎనిమిది మంది షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. శనివారం ఫైనల్స్ జరుగుతాయి.
మను జోరు...ఇషా తడబాటు
రెండో కాంస్యం నెగ్గిన తర్వాత మరో పతకం రాకుంటే ఎవ్వరూ నిరుత్సాహపడొద్దని చెప్పిన భాకర్ తన ఫేవరెట్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అది నుంచే సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. ఈ పోటీ క్వాలిఫికేషన్‌ను ప్రెసిషన్, ర్యాపిడ్ అనే రెండు రౌండ్లలో నిర్వహించారు. ప్రెసిషన్‌లో పదేసి షాట్ల చొప్పున మూడు సిరీస్‌లను షూటర్లు ఐదు నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్‌లోనూ పదేసి షాట్ల చొప్పున మూడు సిరీస్‌లను నిర్వహించారు. ఇందులో ప్రతీ మూడు సెకండ్లకు ఒకసారి గ్రీన్‌లైట్ రాగానే టార్గెట్‌ను షూట్ చేయాల్సి ఉంటుంది. మను రెండు రౌండ్లలోనూ మొదటి నుంచి చివరి వరకు టాప్3లోనే నిలవగా..
ప్రెసిషన్‌లో ఓ దశలో మూడో ప్లేస్‌కు వచ్చిన ఇషా నిలకడ కొనసాగించలేక కిందకు పడిపోయింది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగించిన భాకర్ ప్రెసిషన్‌లో మూడు సిరీస్‌ల్లో వరుసగా 97, 98, 99 స్కోర్లతో మొత్తం 294 పాయింట్లు సాధించింది. ర్యాపిడ్‌లో మరింత మెరుగైన ఆమె ఓ పర్ఫెక్ట్ 100తో పాటు రెండు 98 స్కోర్లతో 296 పాయింట్లు రాబట్టి ఫైనల్ చేరుకుంది. హైదరాబాదీ ఇషా ప్రెసిషన్‌లో తొలి రెండు సిరీస్‌ల్లో 95, 96 స్కోర్లే చేసినా మూడో దాంట్లో పర్ఫెక్ట్ 100తో మొత్తంగా 291 పాయింట్లతో ఆశలు రేపింది. కానీ, ర్యాపిడ్ రౌండ్‌కు వచ్చేసరికి ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. ఇందులో 97, 96, 97 స్కోర్లతో 290 పాయింట్లు మాత్రమే రాబట్టి నిరాశగా వెనుదిరిగింది.
అనంత్ జీత్‌కు నిరాశ
స్కీట్‌లో ఇండియా షాట్‌గన్ షూటర్ అనంత్ జీత్ సింగ్ ఆకట్టుకోలేకపోయాడు. క్వాలిఫికేషన్ రౌండ్ తొలి రోజు ముగిసిన తర్వాత 68 స్కోరుతో 26 స్థానంలో నిలిచాడు. శనివారం మరో రెండు క్వాలిఫికేషన్ రౌండ్లు పూర్తయ్యాక టాప్–6లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు క్వాలిఫై అవుతారు.