తెలుగమ్మాయిగా టాలీవుడ్‌కు పరిచయమై తనదైన నటనతో ఆకట్టుకుంటోంది ఈషా రెబ్బా. తాజాగా ఆమె సుధీర్ బాబుకి జంటగా ‘మామా మశ్చీంద్ర’ చిత్రంలో నటించింది. యాక్టర్ కమ్ రైటర్ హర్షవర్ధన్ దర్శకుడిగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు కలిసి నిర్మించిన సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా చెప్పిన విశేషాలు.
‘‘హర్షవర్ధన్ గారు డైరెక్టర్‌గా చేస్తున్నారని చాలా ఆనందంగా అనిపించింది. ఆయన చేసిన ‘అమృతం’షో నాకు చాలా ఇష్టం. అలాగే గుండెజారి గల్లంతయ్యిందే, మనం చిత్రాల్లో ఆయన రైటింగ్ నచ్చుతుంది. ఆయన కథ చెప్పినప్పుడు ఎక్సైటింగ్‌గా అనిపించింది. చాలా మలుపులు, ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న కథ ఇది. ఆయన రైటర్ కావడంతో పాత్రలన్నీ వివరంగా రాశారు. ప్రతి క్యారెక్టర్‌కు ఒక బ్యాక్ స్టోరీ.. ఇంపార్టెన్స్ ఉంటుంది.
నా పాత్ర పేరు వైరల్ విశాలాక్షి. తను టిక్ టాక్ వీడియోలు చేస్తుంది. చాలా హైపర్‌గా ఉంటుంది. సుధీర్ బాబు చాలా కొత్తగా కనిపిస్తారు. ఆయన పోషించిన మూడు పాత్రల్లో దుర్గాకి నేను జోడీగా కనిపిస్తా. దుర్గా గెటప్‌లో సెట్స్‌లోకి వచ్చినపుడు ఆయన్ను అసలు గుర్తుపట్టలేకపోయాను. అంతలా మేకోవర్ అయ్యారు. ఇందులో ప్రతి పది నిమిషాలకు ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది.
మృణాళిని రవి మరో హీరోయిన్‌గా నటించింది. తను మంచి డ్యాన్స్ పెర్ఫార్మర్. షూటింగ్‌లో మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. పదేళ్ల నా జర్నీలో మంచి పాత్రలు, సినిమాలు చేశాననే సంతృప్తి ఉంది. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ ప్రభుతో ఓ ప్రాజెక్ట్, తెలుగులో మరో మూవీ చేస్తున్నా. ‘దయ’ వెబ్ సిరీస్ సెకెండ్ సీజన్ త్వరలో స్టార్ట్ అవుతుంది’’.