అద్భుతాలను సృష్టించటం ఎంత కష్టమో వాటిని కాపాడుకోవటం కూడా అంతే కష్టంగా మారింది. ముంబై మహానగరంలోని అలాంటి అద్భుతాల్లో ‘ఎస్‌ప్లనైడ్ మాన్షన్’ కూడా ఒకటి. ఈ బిల్డింగ్‌కి 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. మరెన్నో ప్రత్యేకతలు దీని సొంతం. అవన్నీ కొద్ది రోజుల్లో చరిత్రలో కలిసిపోనున్నాయి. మహారాష్ట్ర సర్కారు ఏం చేస్తుందనే సస్పెన్స్ సిటీ జనాల్లో నెలకొంది.
సౌత్ ముంబైలోని కాలా ఘోడా ఏరియాలో ఉన్న ఈ పెద్ద బిల్డింగ్ పేరు ఎస్‌ప్లనైడ్ మాన్షన్. దీన్ని 1871లో క్యాస్ట్ ఐరన్ (పోత ఇనుము)తో కట్టారు. ఇండియాలోని ఈ తరహా నిర్మాణాల్లో ఇదే ఓల్డ్. ఈ భవనానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది మన దేశంలోనే మొదటి లగ్జరీ హోటల్. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ కాంప్లెక్స్‌లోని ఒక రూమ్‌లోనే సినిమాల్ని ప్రదర్శించారు. ఈ బిల్డింగ్ ప్రస్తుతం ‘వరల్డ్ మోస్ట్ ఎన్డేంజర్డ్ మాన్యుమెంట్స్’ లిస్టులోకి చేరిపోయింది.
1960 నాటికి ఈ బిల్డింగ్ వయసు 90 ఏళ్లు పైబడింది. అందులోని రూమ్‌లను కమర్షియల్‌గా, రెసిడెన్షియల్ పరంగా అద్దెలకు ఇవ్వటంతో పాడుబడటం మొదలైంది. ఎస్‌ప్లనైడ్ మ్యాన్షన్ డ్యామేజ్ అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ క్షణంలోనైనా కూలే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. సరిగ్గా ఏడాది క్రితం ఈ బిల్డింగ్‌లోని ఓ బాల్కనీ కూలిపోవటంతో ఒక వ్యక్తి కిందపడి చనిపోయాడు. ఈ ఘటనను మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సీరియస్‌గా తీసుకుంది. కాంప్లెక్స్‌లో అద్దెకు ఉంటున్నవాళ్లను అప్పటినుంచి ఖాళీ చేయించటం ప్రారంభించింది. ఈ పాత బిల్డింగ్‌ని రిపేర్ చేయాల్సి ఉందని, అందుకే అందరినీ పంపించేస్తున్నామని అప్పట్లో చెప్పుకొచ్చింది. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–ముంబై’ పోయిన నెలలో ఈ కట్టడానికి సంబంధించి ఒక రిపోర్ట్‌ని రిలీజ్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్‌ప్లనైడ్ మాన్షన్‌ని కూల్చివేయటమే కరెక్ట్ అని తేల్చిచెప్పింది. రిపేర్ కోసం ప్రయత్నించటం లాజికల్‌గా, ఎకనామికల్‌గా సరికాదని, నిర్మాణపరంగా చూస్తే అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది.
హైకోర్టు నిర్ణయంతో అంతా షాక్
ఈ బిల్డింగ్‌ని ఏం చేయాలనేదానిపై తుది నిర్ణయాన్ని బాంబే హైకోర్టు మహారాష్ట్ర హౌసింగ్ అథారిటీకే వదిలేసింది. భవనాన్ని కూల్చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్త చర్యలనుమాత్రం చెప్పాలని కోరింది. హైకోర్టు ఇలా అనటం సిటీలోని హిస్టారియన్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు, హెరిటేజ్ ప్రేమికుల్ని షాక్‌కి గురి చేసింది. మాన్షన్‌ని కూల్చేయకుండా బాగు చేయాలని ఎక్స్‌పర్ట్‌లు సూచిస్తున్నారు. ఇలాంటి ‘లివ్డ్–ఇన్ హెరిటేజ్ స్ట్రక్చర్ల’ను స్టేట్ సర్కార్, సివిక్ అథారిటీ పట్టించుకోకపోతే వారసత్వ సంపదను కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చట్టమూ కారణమే
ముంబైలోని అతి పురాతన బిల్డింగ్లు పాడుబడిపోవటానికి ‘ది మహారాష్ట్ర రెంట్ కంట్రోల్ యాక్ట్–1999’ కూడా ఒక కారణమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చట్టం ప్రకారం అద్దెలను ఓనర్లు ఇష్టమొచ్చినట్లు పెంచటానికి వీల్లేదు. దీంతో ఇలాంటి హెరిటేజ్ బిల్డింగ్‌ల మెయింటనెన్స్ ఖర్చులను యజమానులు భరించలేకపోతున్నారు. రెంట్‌కి ఉండేవాళ్లేమో హౌసింగ్ అథారిటీ ఆధ్వర్యంలోని రిపేర్ ఫండ్‌కి కొద్ది మొత్తంలోనే సెస్ కడుతున్నారు. ఫలితంగా ఆ అథారిటీ ఇలాంటి కట్టడాల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేకపోతోంది.
130 రూములు.. 20 సూట్లు..
ఎస్‌ప్లనైడ్ మాన్షన్కి సంబంధించిన ఆర్కిటెక్చరల్, కల్చరల్ అంశాలను ‘బాంబే గొథిక్’ బుక్‌లో క్రిస్టోఫర్ లండన్ అనే రైటర్ రాశారు. అరుదుగా దొరికే పోత ఇనుముతో కట్టిన ఈ బిల్డింగ్‌కి 1860లో రౌలాండ్ మ్యాసన్ ఆర్డిష్ అనే బ్రిటిష్ ఇంజనీర్ డిజైన్ చేశాడు. కన్స్ట్రక్షన్ మెటీరియల్‌ని ఇంగ్లండ్ నుంచి తెప్పించి ఇక్కడ అసెంబుల్ చేశారు. ఈ కాంప్లెక్స్‌లో 130 రూమ్‌లు, 20 సూట్లు ఉన్నాయి. ఒక పెద్ద బారు, ఆరు బిలియర్డ్ టేబుళ్లు; హ్యాండ్సమ్ డైనింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఫర్నీచర్, ఉడ్ ఫినిషింగ్ వర్క్ కోసం టేకు, దేవదారు కలపను వాడారు.
జంషెడ్ టాటా కోపానికి కారణం
ఈ మాన్షన్ పేరు తొలి రోజుల్లో వాట్సన్స్ హోటల్. నాడు ఇండియాను బ్రిటిషర్లు పాలించేవారు. బ్రిటిష్ ఇండియా జమానాలో లగ్జరీ సౌకర్యాలు ఈ హోటల్లో తప్ప మరెక్కడా లేవు. అందువల్ల ఈ హోటల్లోకి యూరోపియన్లను మాత్రమే రానిచ్చేవారు. ఒకసారి మన దేశ పారిశ్రామిక పితామహుడు జంషెడ్ టాటానికూడా రానివ్వలేదు. దీంతో ఆయన పట్టుబట్టి 1903లో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ని కొలాబా (ముంబై)లో కట్టించారు. సాహసంతో బ్రిటిష్‌వాళ్లను ఎదిరించి నిలిచారు. వాట్సన్స్ హోటల్ 1920లో మూతపడింది. ఆ బిల్డింగ్‌ని తర్వాత వేరేవాళ్లకు అమ్మేశారు. 1944 నుంచి ఎస్‌ప్లనైడ్ మాన్షన్‌గా వ్యవహరిస్తున్నారు. మునిసిపల్ కమిటీ దీనికి గ్రేడ్–2 హెరిటేజ్ స్ట్రక్చర్ హోదా ఇచ్చింది.