
ప్రెగ్నెన్సీతోపాటు డెలివరీ తర్వాత కూడా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో ఫిజికల్, ఎమోషనల్‌గా చాలా మార్పులు వస్తాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు సరైన ఫుడ్ తీసుకోవడం వల్ల ఎనీమియా, ఇన్ఫెక్షన్స్, ఫ్యాటిగ్ వంటివి రాకుండా అడ్డుకోవచ్చు. అంతేకాకుండా మెదడు, ఎముకలు, ఇమ్యూనిటీ డెవలప్మెంట్కు సాయపడుతుంది.
సింపుల్‌గా చెప్పాలంటే.. బ్యాలెన్స్డ్ డైట్. అందుకోసం విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి ఎక్కువగా ఉండేవి తినాలి. పైగా తల్లి, తనతోపాటు గర్భంలో ఎదుగుతోన్న బిడ్డ కోసం కూడా పోషకాలు అందించాలి. కాబట్టి ఐరన్, కాల్షియం, విటమిన్ సి, ప్రొబయోటిక్స్ వంటివి తీసుకోవాలి. ఇవి ఎనర్జీ లెవల్స్‌ని బూస్ట్ చేస్తాయి. వాపును తగ్గిస్తాయి. పాల నాణ్యతను పెంచుతాయి. అవి ప్రెగ్నెన్సీ, పోస్ట్‌పార్టమ్ టైంలో కీలకపాత్ర పోషిస్తాయి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
సూపర్ ఫుడ్స్ ఇవే...
సిట్రస్ ఫ్రూట్స్ : ఆరెంజెస్, నిమ్మకాయలు, బత్తాయి వంటివి తీసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ సి ఐరన్‌ని గ్రహించడానికి సాయపడుతుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్‌కి సపోర్ట్ చేస్తుంది. ప్రతిరోజు ఒక ఆరెంజ్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో డెఫీషియన్సీలు, ఫ్యాటిగ్ రాకుండా అడ్డుకోవచ్చు.
వెల్లుల్లి : వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. వెల్లుల్లిని సూప్స్, పప్పులు, ఫ్రైలలో ఎక్కువగా తినొచ్చు.
అల్లం : అల్లం వికారాన్ని తగ్గించడానికి, జీర్ణశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వాపును తగ్గిస్తుంది. శ్వాస ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పాలకూర: ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, సి వంటివి పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. అవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, బిడ్డలో నరాల ఎదుగుదలకు సపోర్ట్ చేస్తాయి.
బాదం: బాదం పప్పుల్లో విటమిన్ ఇ, హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి స్కిన్ ఎలాస్టిసిటీకి, ఇమ్యూనిటీ పెంచడానికి, ఎనర్జీ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తాయి.
పసుపు : ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. గాయాలను త్వరగా నయం చేస్తుంది. పోస్ట్‌పార్టమ్ సమయంలో గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగితే చాలా మంచి ది. సాధారణంగా ఎవరైనా పసుపు పాలు తాగొచ్చు. దానివల్ల శరీరానికి ఉపశమనం కలుగుతుంది.
పెరుగు : పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్ గట్ హెల్త్, డైజెషన్కి సపోర్ట్ చేస్తాయి. అంతేకాదు పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అది తల్లీబిడ్డల ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
బ్లూబెర్రీస్ : వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సాయపడతాయి. ఎనర్జీని పెంచడానికి సపోర్ట్ చేస్తాయి.