
బెంగుళూరు: కర్ణాటక లారీ యజమానులు, ఏజెంట్ల సంఘం నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఇంధన ధరల పెరుగుదల, టోల్ ప్లాజాలలో ఎదురవుతోన్న వేధింపులకు వ్యతిరేకంగా 2025, ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి స్ట్రైక్‌కు దిగారు. ఒక్క పాలు రవాణా చేసే ట్రక్కులు తప్ప.. మిగతా అన్ని ట్రక్కులు రోడ్లపై తిరగవని అసోసియేషన్ వెల్లడించింది. సమ్మె ఎఫెక్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 వేల ట్రక్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నిత్యావసరాలు, నిర్మాణ సామాగ్రి, పెట్రోల్, ఎల్‌పీజీ, ఇతర వస్తువులను రవాణా చేసే ట్రక్కులు రోడ్డెక్క లేదు.
కర్ణాటక లారీ యజమానుల అసోసియేషన్‌కు సమ్మెకు 24 రాష్ట్రాల నుంచి 60కి పైగా రవాణా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సమ్మె సమయంలో ఈ 24 రాష్ట్రాల నుంచి ట్రక్కులు కర్ణాటకలోకి ప్రవేశించవు.కర్ణాటక లారీ యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆర్. షణ్ముగప్ప మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వం కేవలం ఏడు నెలల వ్యవధిలో రెండుసార్లు డీజిల్ ధరను పెంచిందని.. దీని వలన నిర్వహణ ఖర్చులు పెరిగి ట్రక్కలు నడపడం గుదిబండగా మారిందన్నారు.
డీజిల్ ధరల పెరుగుదల కర్ణాటకలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేసిందన్నారు. ప్రభుత్వం వెంటనే డిజిల్ ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే.. ట్రక్కర్లకు టోల్ ప్లాజాలలో ఎదురవుతోన్న వేధింపులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మె కారణంగా కర్ణాటక నుంచి తమిళనాడుకు రోజుకు 4,000 లోడ్ల కూరగాయలు, బియ్యం, మందులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోతుందన్నారు.
Also Read :- ఏడాదికి టోల్ పాస్ రూ.3వేలే.. శాటిలైట్ ఆథారిత టోల్ అప్పటి నుంచే
కూరగాయాల కోసం ఎక్కువగా కర్నాటకపై ఆధారపడే చెన్నైపై ఈ ప్రభావం వెంటనే పడుతోందని తెలిపారు. కర్ణాటక లారీ యజమానుల సమ్మె ప్రభావం వ్యాపారులతో పాటు సామాన్య ప్రజలపైన పడుతోంది. దాదాపు 24 రాష్ట్రాలపై ఈ సమ్మె ప్రభావం చూపించింది. సరఫరా ఆగిపోవడంతో నిత్యవసరాల ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డిజిల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. లారీ యజమానుల అసోషియేషన్‌తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
కర్నాకట లారీ యజమానుల అసోషియేషన్ ప్రధాన డిమాండ్స్:
- కర్ణాటకలో టోల్ వసూలును రద్దు చేయడం
- రాష్ట్ర సరిహద్దుల్లో RTO చెక్‌పోస్టులను తొలగించడం
- ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరణకు రూ.15,000 వసూలు చేయాలన్న కేంద్రం ఆదేశాన్ని ఉపసంహరించుకోవడం.
- రాజధాని బెంగళూరులో ట్రక్కులకు 'నో ఎంట్రీ' పరిమితిని సడలించడం