డ్రగ్స్​ అంటేనే వణికిపోవాలి.. ఎంత పెద్దవాళ్లున్నా వదలొద్దు : సీఎం రేవంత్​రెడ్డి

డ్రగ్స్​ అంటేనే వణికిపోవాలి.. ఎంత పెద్దవాళ్లున్నా వదలొద్దు  :   సీఎం రేవంత్​రెడ్డి
  • పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా.. గంజాయి, డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపండి
  • మీకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తది
  • యాంటీ డ్రగ్స్​ టీమ్​లు ఏర్పాటు చేసుకోండి
  • నాలాల పూడికతీతలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
  • హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే వేటు తప్పదు.. పనిచేసే వాళ్లను ప్రోత్సహిస్తం
  • ఓఆర్​ఆర్​ లోపలి ప్రాంతమంతా యూనిట్​గా విపత్తు నిర్వహణ వ్యవస్థ ఉండాలి
  • 365 రోజులూ అలర్ట్​గా పనిచేయాలని సూచన
  • పోలీస్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ పరిశీలన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని.. ఈ విషయంలో మరింత యాక్టివ్ గా పనిచేయాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ‘‘డ్రగ్స్​ సరఫరా చేయాలంటే.. అసలు ఆ పదం వింటేనే భయపడేలా, వణుకుపుట్టేలా చర్యలుండాలి. డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా... ఎంత పెద్దవాళ్లున్నా ఉపేక్షించొద్దు” అని తేల్చిచెప్పారు. హైదరాబాద్​లోని పోలీస్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ను శనివారం సీఎం రేవంత్​ రెడ్డి పరిశీలించారు. ఈ సెంటర్​ను మొదటిసారి విజిట్​ చేసిన ఆయన.. టీజీ న్యాబ్​తో పాటు ఇతర విభాగాల్లో కలియతిరిగారు. అక్కడే పోలీస్, ఎక్సైజ్​, మున్సిపల్​, విద్యుత్​ శాఖల అధికారులతో సమీక్షించారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని.. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు  గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్​ను బ్రేక్ చేయాలని సూచించారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్​ను ఏర్పాటు చేయాలని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్ గా పని చేసేవాళ్లను ప్రోత్సహించాలన్నారు.  పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని,  డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పారు. తెలంగాణను డ్రగ్స్  రహిత రాష్ట్రంగా మార్చాలని, దేశంలో ఇతర రాష్ట్రాలకు టీజీ న్యాబ్​ ఆదర్శంగా నిలవాలని సూచించారు.

జూన్​ 4లోగా పూర్తి ప్రణాళిక సిద్ధం చేయండి

హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందికి తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ‘‘ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలి. వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థ ఉండాలి.  ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా జూన్ 4లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలి” అని ఆయన స్పష్టం చేశారు. నాలాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దని, పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించాలన్నారు. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఆకస్మిక తనిఖీలు చేపడ్త

ఎలక్షన్​ కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. హైదరాబాద్​లో ఓపెన్ సెల్లార్ గుంతల చుట్టూ బారికేడింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. కంటోన్మెంట్ ఏరియాలో నాలాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలన్నారు. సమస్యాత్మక నాలాల వద్ద అవసరమైతే ప్రతి రోజు క్లీనింగ్ చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ అంతరాయం కలగకుండా పనులు జరగాలన్నారు. పవర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని అధికారులను ఆయన హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని, వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.