- ఉన్నతాధికారులకు మంత్రులు,ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు
- పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల లోపే చేయాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సిఫార్సుల లేఖలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు తమ నియోజకవర్గాల్లో కొత్త పంచాయతీలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తమ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులపై వారు ఒత్తిడి చేస్తున్నారు.
రాష్ట్రంలో 12,769 పంచాయతీలు ఉండగా.. 223 కొత్త పంచాయతీలతో కలిపి వాటి సంఖ్య 12,991కు చేరింది. ఇందులో ఒక పంచాయతీ మున్సిపాలిటీగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 223 కొత్త పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ, మండలి కూడా ఆ బిల్లులను ఆమోదించాయి. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అప్పటి గవర్నర్ తమిళిసైకి మధ్య గ్యాప్ ఉండడంతో ఆ బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. తర్వాత గవర్నర్ మారడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా ఓడిపోయింది.
కొత్తగా వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్త పంచాయతీలకు ఆమోదముద్ర వేశారు. దీంతో రేవంత్ సర్కారు కొత్త పంచాయతీలపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 2న కొత్త పంచాయతీలను గెజిట్ లో చేర్చడంతో పాటు ఆ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాత పంచాయతీలతో పాటు కొత్తగా ఏర్పాటయినా 223 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త పంచాయతీల్లో వార్డులు, ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేశారు.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఈ కొత్త పంచాయతీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాకుండా, రాష్ట్రంలో ప్రస్తుతం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలు ఉండగా.. కొత్తగా పంచాయతీలను మున్సిపాల్టీలుగా అప్ గ్రేడ్ చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తున్నది.
పట్టుపడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు
పంచాయతీ ఎన్నికలు నిర్వహించే లోపే తమ నియోజకవర్గంలో కొత్త పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. కొత్త పంచాయతీలు ఏర్పాటయితే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫండ్స్ వస్తాయని, గ్రామాల అభివృద్ధికి అవకాశం ఉంటుందని, పాలనా సౌలభ్యం కూడా ఉంటుందని చెబుతున్నారు.
ఎన్నికల ముందే పంచాయతీలను ఏర్పాటు చేస్తే పార్టీకి కూడా కలిసి వస్తుందని పేర్కొంటున్నారు. అయితే, తమను మండలం నుంచి వేరుచేసి కొత్త మండలం ఏర్పాటు చేయాలని, ఉన్న పంచాయతీ నుంచి విడదీసి కొత్త గ్రామ పంచాయతీ చేయాలని, పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు. వారు నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భాల్లోనూ ఆ డిమాండ్ చేస్తున్నారు.