హైదరాబాద్‎లో అలెగ్రో మైక్రో సిస్టమ్: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: వందేండ్ల చరిత్ర కలిగిన అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్‎లో సెమీ కండక్టర్స్ ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేయబోతోందని ఐటీ మినిస్టర్  దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తద్వారా వచ్చే ఐదేండ్లలో 500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. అలెగ్రో మైక్రో సిస్టమ్‎తో  రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల బృందం ఇవాళ సెక్రటేరియట్‎లో భేటీ అయ్యింది. దీనికి సంబంధించిన వివరాలను అలెగ్రో మైక్రోసిస్టమ్స్ సీఈవో వినీత్ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ‘ఇండియాలో ఎన్నో ప్రధాన నగరాలను కాదని హైదరాబాదులో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. 

ప్రభుత్వపరంగా వారికి అన్ని విధాలా పూర్తి సహకారం ఉంటుంది. ఇక్కడున్న ఎక్కువ సిస్టం స్కేల్ వర్కర్ల అవైలబిలిటీ గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో సెమీ కండక్టర్ల వినియోగం విరివిగా పెరుగుతుంది. ఆటోమేటివ్, ఇండస్ట్రీస్ రంగాల్లో సెమీ కండక్టర్ల వినియోగంపై గ్లోబల్ ఆర్ అండ్ డీ చేస్తారు. ఈరంగానికి చెందిన అతిపెద్ద కంపెనీ తెలంగాణకు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి’ అని శ్రీధర్​బాబు తెలిపారు.