ఆలేరును ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతా :బీర్ల అయిలయ్య

  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు నియోజకవర్గాన్ని ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట మండలం చిన్నగౌరాయపల్లిలో బీర్ల ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను సోమవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్లోరైడ్ రక్కసిని పూర్తిగా అంతం చేయడమే తన లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే ఆలేరు నియోజకవర్గంలోని గ్రామాల్లో బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపుగా 150 ఫిల్టర్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటైన చిన్నగౌరాయపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, స్థానిక కాంగ్రెస్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు.