- ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
- కలెక్టరేట్లోని క్రెచ్ సెంటర్ ఆకస్మిక తనిఖీ
ఖమ్మం టౌన్, వెలుగు : కలెక్టరేట్ లోని ఉద్యోగులపిల్లల కోసం ఏర్పాటు చేసిన క్రెచ్ సెంటర్లో పిల్లల సంరక్షణ పక్కాగా ఉండాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని క్రెచ్ సెంటర్, ఫీడింగ్ రూమ్, ఉద్యోగుల భోజన గదులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు క్రెచ్ సెంటర్ లో ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా అవసరమైన ఆట వస్తువుల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజావాణికి సమస్యలు తెలిపేందుకు వచ్చే ప్రజలకు తెలిసే విధంగా, వారి సమస్యలు చెప్పేంత వరకు వారి పిల్లలను కూడా క్రెచ్ సెంటర్ లో చూసుకోవాలని చెప్పారు. అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసే ఫీడింగ్ రూమ్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఫర్నిచర్, ఫీడింగ్ రూమ్ లో కలర్ టైల్స్ ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డైనింగ్ టేబుల్, చైర్స్, సోఫా, ఏసీ ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏవో అరుణ, పీఆర్ డీఈ మహేశ్‌బాబు, ఏఈ చిరంజీవి, క్రచే కేంద్ర ఆన్‌చార్జి రాణి ఉన్నారు.
వెలుగుమట్ల అర్బన్ పార్క్ పరిశీలన
వెలుగుమట్ల అర్బన్ పార్క్ కు సందర్శకుల సంఖ్య పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అడిషనల్కలెక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన పార్కును పరిశీలించారు. రోజూ పార్కుకు ఎంత మంది సందర్శకులు వస్తున్నారు, ఎంత ఆదాయం సమకూరుతుంది, నిర్వహణకు అవుతున్న ఖర్చు వివరాలను జిల్లా అటవీ అధికారిని అడిగి తెలుసుకున్నారు. పార్క్ ను ప్రభుత్వ పాఠశాలల పిల్లలు సందర్శించి ఆహ్లాదంగా గడిపేలా చూడాలన్నారు. సైక్లింగ్, ఓపెన్ జిమ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ లాంటివి పెంచాలని సూచించారు.
బస్ స్టాప్ నుంచి వెలుగు మట్ల అర్బన్ పార్క్ వరకు మినీ బస్ నడిపే ప్రతిపాదన పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఎఫ్ డీవో వి. మంజుల, ఎఫ్ఆర్వో జి. నాగేశ్వర్ రావు, ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఎఫ్ఆర్వో పి. శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.