- అధికారులు నిర్ణయించిన స్థలం 200 ఎకరాలు
- ఇప్పటి వరకు మడిపెల్లి వద్ద 80 ఎకరాలు సేకరణ
- సవాల్‌గా మారిన మిగతా స్థల సేకరణ..
మహబూబాబాద్, వెలుగు: ఫుడ్ ప్రాసెసింగ్యూనిట్ఏర్పాటు ముందుకు సాగడం లేదు. మహబూబాబాద్ జిల్లాలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని గతంలో ఆఫీసర్లు నిర్ణయించారు. కానీ, ఇప్పటి వరకు 80 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేసి టీఎస్ఐఐసీకి అప్పగించారు. మిగతా భూమి సేకరణ అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో ఐదేండ్లుగా ఫుడ్ప్రాసెసింగ్యూనిట్ఏర్పాటు ముందుకు సాగడం లేదు. ఈ యూనిట్‌ను త్వరగా ఏర్పాటు చేస్తే వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు.
సవాల్‌గా మారిన భూసేకరణ..
జిల్లాలో ఫుడ్ప్రాసెసింగ్యూనిట్కోసం అధికారులు 200 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొర్రూరు మండలం మడిపెల్లి శివారులో 80 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి టీఎస్ఐఐసీ ఆఫీసర్లకు అప్పగించారు. మిగతా భూమి సేకరణే అధికారులకు సవాల్‌గా మారింది. మహబూబాబాద్ మండలం శనిగపురం, ముడుపుగల్, అయోధ్య గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూమి సుమారు 150 ఎకరాల వరకు ఉండటంతో తొలుత ఆఫీసర్లు అక్కడే యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కానీ, ఆయా గ్రామాల రైతులు తాము సాగు చేసుకుంటున్న భూములను తీసుకోవద్దని నిరసనలు చేశారు. మరోవైపు కురవి మండలం రాజోలు, స్టేషన్గుండ్రాతి మడుగు గ్రామాల పరిధిలో సర్వేనెంబర్ 152 లో అసైన్డ్ భూమి సుమారు 250 ఎకరాల వరకు ఉండటంతో సర్వే చేపట్టారు. అక్కడ కూడా రైతులు ఆందోళన చేశారు. దీంతో ఆఫీసర్లు భూసేకరణ తాత్కలికంగా నిలిపివేశారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి
మహబూబాబాద్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం కలుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయి. నిర్వహణ బాధ్యతలు మహిళలకు అప్పగించి ప్రోత్సహించాలి. జిల్లాలో యూనిట్ ఏర్పాటును త్వరగా చేసేలా చర్యలు చేపట్టాలి.
బొమ్మరాతి శ్రీజ, తొర్రూరు
80 ఎకరాలు మాత్రమే అప్పగించారు..
మహబూబాబాద్ జిల్లాలో సుమారు 200 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలని భావించాం. ఇప్పటి వరకు రెవెన్యూ ఆఫీసర్లు తొర్రూరు మండలం మడిపెల్లి వద్ద 80 ఎకరాల భూమిని మాత్రమే అప్పగించారు. హెడ్ ఆఫీస్‌కు భూమి వివరాలు పంపించాం. ఇప్పటి వరకు ఏ కంపెనీ ఏర్పాటుకు భూమి కేటాయించలేదు. ప్రక్రియ ప్రాసెస్‌లో ఉంది.
సత్యనారాయణ, టీఎస్ఐఐసీ, జిల్లా ఇన్చార్జి మేనేజర్, మహబూబాబాద్