- చైర్మన్‌గా టీఎన్జీవో ప్రెసిడెంట్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌గా టీజీవో ప్రెసిడెంట్ శ్రీనివాస రావు
- ప్రభుత్వంతో చర్చల కోసం 15 మందితో స్టీరింగ్ కమిటీ
- 317 జీవో సవరణ, సీపీఎస్ రద్దు సహా సర్కారు ముందు పలు డిమాండ్లు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గెజిటెడ్, నాన్ గెజిటెడ్, ఉపాధ్యాయ, రెవెన్యూ, గ్రూప్ 1 తదితర 54 సంఘాలు కలిసి సోమవారం ఉద్యోగ జేఏసీగా ఏర్పడ్డాయి. జేఏసీ చైర్మన్ గా టీఎన్జీవో ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్ ను, సెక్రటరీ జనరల్ గా టీజీవో ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాస రావును యూనియన్ నేతలు ఎన్నుకున్నారు. నాంపల్లి టీఎన్జీవో భవన్ లో అన్ని సంఘాల నేతలు ఉద్యోగులకు సంబంధించిన 36 సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. వీటిపై ప్రభుత్వంతో చర్చల కోసం 15 మంది ఉద్యోగ సంఘాల నేతలతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ అని చెప్పి ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదన్నారు. ప్రతి నెలా 15 నుంచి 20 వరకు జీతాలు వచ్చేవని తెలిపారు. కానీ, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, త్వరలో కేంద్రం మరో డీఏను ప్రకటించనుందని, వాటన్నింటినీ రిలీజ్ చేయాలన్నారు.
గత ప్రభుత్వం 317 జీవో తెచ్చి స్థానికత కోల్పోయేలా చేసిందని, అపుడు ఉద్యోగ సంఘాలు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ఈ జీవోను సవరించి స్థానికత ఆధారంగా ఉద్యోగులకు న్యాయం చేయాలని జగదీశ్వర్ కోరారు. సీపీఎస్ ను నాలుగు రాష్ట్రాలు రద్దు చేశాయని, ఇందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు. ఇక్కడ కూడా రద్దు చేసి ఓపీఎస్ ను అమలుచేయాలన్నారు. సీఎం విదేశీ పర్యటన నుంచి రాగానే ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించాలన్నారు. ఆర్థిక భారం లేని సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
గత ప్రభుత్వంలో ఎన్నో ఆంక్షలు
గత ప్రభుత్వంలో ఉద్యోగుల జేఏసీ ఉన్నా.. సమస్యలపై మాట్లాడకుండా ఎన్నో ఆంక్షలు విధించిందని జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అందరూ కలిసి జేఏసీగా రావాలని కోరిందని, ఈ నేపథ్యంలో జేఏసీ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి ఉద్యోగుల సమసలన్నీ పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గ్రూప్ 1 అధికారుల సంఘం ప్రెసిడెంట్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్
రెవెన్యూ నుంచి వంగా రవీందర్ రెడ్డి, ఇంటర్ జేఏసీ నుంచి మధుసూదన్ రెడ్డి, టీచర్ల యూనియన్ల నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి (పీఆర్టీయూ), చావ రవి(యూటీఎఫ్), మారెడ్డి అంజిరెడ్డి (టీఆర్టీఎఫ్), ఎస్టీయూ నుంచి పర్వత్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీల నుంచి మధుసూదన్ రెడ్డి, వీఆర్వోల నుంచి గోల్కొండ సతీశ్, బీటీఎన్జీవో నుంచి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.