పసుపు బోర్డు సాధన రైతుల విజయం

పసుపు బోర్డు సాధన రైతుల విజయం

భారతదేశంలో పసుపు రెండు వేల సంవత్సరాలుగా ఒక అద్భుత ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దకంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా  పసుపుతోనే ప్రారంభిస్తారు. భారతదేశంలో పసుపు లేని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రైతు అనుకుంటే పంట పండించడమే కాదు, పంటకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించే బోర్డు ఎలా సాధించుకోవాలో కూడా తెలుసు. పసుపు బోర్డు సాధించి చూపించిన నిజామాబాద్ రైతులు దేశవ్యాప్తంగా ఎంతోమంది రైతులకు ఆదర్శం. పసుపు బోర్డు కోసం 2006లో మొదలైన పోరాటం 2 దశాబ్దాలుగా అలుపెరగకుండా జరిగింది. 

నేడు  సగర్వంగా పసుపు బోర్డును నిజామాబాద్​లో  ఏర్పాటు చేసుకోవడం రైతుల విజయానికి నాంది. పసుపు బోర్డు సాధనలో వారు చూపిన తెగువ ఎనలేనిది. 2019 లోకసభ ఎన్నికల్లో 178 మంది పసుపు రైతులు నిజామాబాద్ ఎంపీ గా పోటీచేయడానికి నామినేషన్ వేయడం. వీరికోసం ఏకంగా ఒక్కో బూత్​లో 12 ఈవీఎం మిషన్లు వాడాల్సి వచ్చింది. వీరు దాదాపు లక్ష ఓట్లు పొందడం ఆ ప్రాంతంలో పసుపు బోర్డు డిమాండ్ ఎంత బలంగా ఉందో అనడానికి నిదర్శనం. అంతే కాకుండా వారణాశిలో  30 మంది పసుపు రైతులు నామినేషన్ వేసి మోదీపై పోటీకి దిగారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో కూడా దాదాపు 27 మంది రైతులు పోటీచేశారు. పొలాల్లో పంటలు పండించడమే కాదు, రాజకీయ చతురత కూడా ప్రదర్శించగలం అని నిరూపించారు పసుపు రైతులు. 

దేశవ్యాప్తంగా  పంటలకు ప్రత్యేక బోర్డులు 

  • కాఫీ బోర్డు: దీనిని 1942లో  బెంగళూరులో కాఫీ ఉత్పత్తులు పెంచడానికి స్థాపించారు.
  • రబ్బర్ బోర్డు: దీనిని 1947లో  కేరళలోని కొట్టాయంలో రబ్బరులో శాస్త్రీయ, సాంకేతిక, ఆర్థిక పరిశోధనలు, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహించడానికి స్థాపించారు.
  •  టీ బోర్డు: దీనిని 1954లో కోల్​కత్తాలో టీ ఉత్పత్తి,  ఎగుమతులు పెంచడానికి స్థాపించారు.
  •  టొబాకో బోర్డు: దీనిని 1976 లో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో టొబాకో ఎగుమతులు పెంచడానికి స్థాపించారు. 
  • కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు: దీనిని 1981లో  కేరళలోని కొచ్చిన్ లో  కొబ్బరి ఉత్పాదకత పెరుగుదల, ఉత్పత్తుల వైవిధ్యీకరణపై దృష్టి సారించి దేశంలో కొబ్బరి ఉత్పత్తి, వినియోగం కోసం సమగ్ర అభివృద్ధి కోసం స్థాపించారు. 

పసుపు బోర్డు లక్ష్యాలు 

రైతులకు లాభం చేకూర్చేలా పసుపు ఎగుమతులకు అనుకూల పరిస్థితులు సృష్టించడం, పంట నాణ్యతను మెరుగుపర్చడం, కొత్త వంగడాల అభివృద్ధి కోసం పరిశోధనలు నిర్వహించి సలహాలు అందించడం, పంట విస్తీర్ణాన్ని పెంచడం, అధిక దిగుబడుల కోసం కృషి చేయడం, పసుపు సాగు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహించడం, పసుపు రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు పసుపు ఔషధ ప్రయోజనాలపై అవగాహన పెంచడం పసుపు బోర్డు లక్ష్యం.  ఈ బోర్డు ద్వారా రైతులకు పసుపు తవ్వకం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, డ్రై చేయడం, పాలిష్‌‌‌‌‌‌‌‌ చేయడానికి అవసరమైన యంత్రాలను రాయితీపై అందించడం జరుగుతుంది. పసుపు పంట విత్తిన తరువాత అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం,  నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహకారం అందిస్తుంది. ఇక పసుపు పంట మార్కెటిం­గ్‌‌‌‌‌‌‌‌ కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చే బాధ్యత సైతం బోర్డు తీసుకుంటుంది. పసుపు పండిస్తున్న 20 రాష్ట్రాల రైతులకు ప్రత్యేక లాభం చేకూరనున్నది.  

  పసుపు ఉత్పత్తి , ఎగుమతులు 

గత సంవత్సరం, 2023-–24, భారతదేశంలో 3.05 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 10.74 లక్షల టన్నుల ఉత్పత్తితో పసుపు సాగు చేయబడింది.  ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 70% పైగా భారతదేశం పండిస్తోంది. మన దేశంలో 30 రకాల పసుపు ఉత్పత్తి చేయబడుతోంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారు.  ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం 62% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. 2023-–24లో, 226.5 మిలియన్ డాలర్లు విలువైన 1.62 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. భారతదేశం నుంచి పసుపు ఎగుమతులు 2030 నాటికి  బిలియన్​ డాలర్లకు పెరుగుతాయని అంచనా. మన పసుపు ఎక్కువగా బంగ్లాదేశ్, యూఏఈ, అమెరికా, మలేషియాకి ఎగుమతి అవుతున్నది.  కాగా, వ్యవసాయ విభాగానికి అందించే  సబ్సిడీలు నేరుగా రైతులకు చేరాల్సిన అవసరం ఉంది.  రైతులు, వ్యవసాయ పరిశ్రమల మధ్య లాభాలను సమానంగా పంచుకోవాలి.  రైతులు వ్యవసాయానికి ఖర్చుచేసే ప్రతి రూపాయి దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది.  పసుపు బోర్డుకి సంబంధించిన ఈ విజయగాథ నిజామాబాద్ రైతుల పోరాట పటిమను, కృషిని, పట్టుదలని ప్రతిబింబిస్తోంది.  దేశవ్యాప్తంగా ఇతర రైతులకు కూడా ఇది ఒక ఆదర్శంగా నిలిచింది. 

స్పైసెస్ బోర్డు: దీనిని 1987  కేరళలోని కొచ్చిన్ లో 52 సుగంధ ద్రవ్యాలు, మసాలా ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి స్థాపించారు. పసుపు కూడా స్పైసెస్ బోర్డు పర్యవేక్షణలో ఉండేది. కానీ అంత ప్రాధాన్యం ఉండేది కాదు. కాబట్టి ప్రత్యేక బోర్డు  సాధనకు  2019 లోక్ సభ ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసి ఇచ్చిన బీజేపీ అభ్యర్థి అయిన ధర్మపురి అరవింద్ ను గెలిపించి, పసుపు రైతుల గళం ఢిల్లీలో వినిపించాలనుకున్నారు.  2020లో కేంద్రం నిజామాబాద్​లో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్సటెన్షన్ సెంటర్​ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ ‘ట్రేడ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్​పోర్ట్ స్కీమ్’ని అమలుపరుస్తూ పసుపు సాగుకు మౌలిక వసతులు కల్పిస్తూ ఎగుమతులకు పెంపొందించడానికి దోహదపడింది. కానీ, పసుపు రైతులు ప్రత్యేక బోర్డు కావాలని పట్టుబట్టారు. రైతుల అలుపెరగని పోరాటాన్ని గుర్తించి  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ పాలమూరు ప్రజాగర్జన సభలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేశారు.


- శ్రీనివాస్ జక్కుల,
(హెచ్​సీయూ పూర్వ విద్యార్థి),
- విజయేందర్ అల్లం,
(టీఐఎస్ఎస్​ హైదరాబాద్​ పూర్వ విద్యార్థి)