- ఇయ్యాల భూమి పూజ చేయనున్న మంత్రి కేటీఆర్
- వచ్చే ఏడాది మినీ మిల్అందుబాటులోకి... రెండేండ్లలో పూర్తి
- రెండు జిల్లాల్లో పెరుగనున్న ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం
మంచిర్యాల, వెలుగు : ఆయిల్ పామ్ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందడుగు పడ్డది. మ్యాట్రిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో మందమర్రి మండలంలోని శంకర్పల్లి వద్ద ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. మూడేండ్ల కిందటే మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఆదివారం జిల్లా పర్యటనకు వస్తున్న రాష్ట్ర మున్సిపల్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ భూమిపూజ చేసి పనులు స్టార్ట్ చేయనున్నారు.
70 ఎకరాల్లో రూ.500 కోట్లతో శంకర్పల్లి వద్ద పామాయిల్ ఫ్యాక్టరీని మ్యాట్రిక్స్ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. దీనిని రెండు విడతల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. తొలి విడతలో ఏడాదిలోపే పామాయిల్ మిల్‌ను ప్రారంభించి, రెండో విడతలో రిఫైనరీని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి దొరుకుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మొదట జైపూర్ మండల కేంద్రంలోని నర్సరీ వద్ద పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ తర్వాత దానిని మందమర్రి మండలంలోని శంకర్‌పల్లికి మార్చారు.
పెరుగనున్న సాగు విస్తీర్ణం
మనదేశంలో పామాయిల్ ఉత్పత్తి తక్కువగా ఉండడంతో మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతులను ఈ పంటవైపు మళ్లిస్తోంది. జిల్లాలో 2020లో ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభించారు. ఇప్పటివరకు 2,800 ఎకరాల్లో సాగైంది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 900 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 5వేల ఎకరాలకు చేరుకునే అవకాశముంది.
ఏడాదిలోగా మినీ మిల్లు సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం సహకారంలో జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేపట్టడంతో పాటు శంకర్పల్లి వద్ద పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నాం. 70 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాదిలోగా మినీ మిల్లును రెడీ చేస్తాం. ఆ తర్వాత సంవత్సరంలోగా రిఫైనరీ ఏర్పాటు చేస్తాం.
- ఉదయ్‌కుమార్, మ్యాట్రిక్స్ కంపెనీ సీఈవో