నల్గొండ జిల్లా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లే ఇవాళ రాష్ట్రంలోని దాదాపు 10 లక్షల మందికి పెన్షన్లు వచ్చాయని, వారంతా రాజగోపాల్ రెడ్డిని గుర్తుకుపెట్టుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం మునుగోడులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్ రెడ్డితో కలిసి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. అంతకు ముందు ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీ నాయకులు ఆయా ప్రాంతాల్లో పెండింగ్ పనులు మాత్రమే చేసేవారని, కానీ హుజురాబాద్ బై ఎలక్షన్ తో సీన్ మారిందని ఈటల తెలిపారు. హుజురాబాద్ లో దళితుల ఓట్లు కొల్లగొట్టేందుకు కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించారన్నారు. ఇవాళ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఈటల చెప్పారు. రాజీగోపాల్ రాజీనామాతో కేసీఆర్ లో భయం మొదలైందని పేర్కొన్నారు.
మునుగోడులో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల మకాం
ఏనాడూ కనబడని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ మునుగోడులో మకాం వేసి ఎక్కడికి వెళ్లడం లేదని ఈటల రాజేందర్ చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ నేతలు పడరాని పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎనిమిదిన్నరేళ్లుగా గిరిజనులను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదని, ఇవాళ మునుగోడులో ఓట్లను కొల్లగొట్టేందుకు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు అంటూ నాటకం మొదలు పెట్టారని ఆరోపించారు. ఒక్క మునుగోడులోనే పెన్షన్లు, రిజర్వేషన్లు, గిరిజన బంధు ఇస్తామంటే అపహాస్యం పాలవుతామని గ్రహించిన కేసీఆర్... ఆ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతున్నారని ఈటల విమర్శించారు. ఇలా రకరకాల స్కీమ్ లతో మునుగోడులో ఓట్లను కొల్లగొట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మునుగోడులో అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు, గిరిజన బంధు ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు.
ఇతర కులస్థులకు ‘పేద బంధు’ ఇవ్వాలె
పేదరికానికి కులానికి సంబంధం లేదని.. పేదలుగా ఉన్న ఇతర కులస్థులకు పేద బంధు ఇవ్వాలని ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొల్ల కురుమలకు రెండో విడత గొర్లను పంపిణీ చేయాలని ఆయన కోరారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆర్ధికంగా నెంబర్ వన్ గా ఎదిగిందని చెప్పుకునే సీఎంకు..రాష్ట్రంలోని నిరుపేదలకు ఆర్ధిక సాయం చేయడానికి ఏం ఇబ్బందులున్నాయని ప్రశ్నించారు. ఎన్నికలలోపే వారందరికీ ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. మూడునెలలుగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు లేవన్న ఈటల... రెండు నెలలుగా వీఆర్ఏలు ధర్నా చేస్తన్నా కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా బీజేపోళ్లు కరెంట్ మీటర్లు పెడ్తారంటూ కేసీఆర్ దుష్ప్రచారం చేశారని, అయినా ఆ రెండు చోట్ల టీఆర్ఎస్ కు ఓటమి తప్పలేదని గుర్తు చేశారు. పోడు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన గిరిజన మహిళలను టీఆర్ఎస్ ప్రభుత్వ అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసిందని ఫైర్ అయ్యారు. మునుగోడులో ప్రజలకు ఏ లబ్ది చేకూరినా అది రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లేనని గుర్తుపెట్టుకోవాలని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.