టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు గ్రానైట్ గనులు, క్వారీలు, లిక్కర్ దందాలతో పాటు గిరిజనులు, ఆదివాసీలు, దళితుల భూములను కూడా స్వాహా చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. హుజూరాబాద్ క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. దశాబ్దాల కిందట హైదరాబాద్ శివార్లలో దళితులు, గిరిజనులకు ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చిన భూములను అగ్వకు కొట్టేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. శంకర్ పల్లిలో గిరిజనులకు పంపిణీ చేసిన 600 ఎకరాల భూములపై ఇప్పుడు అధికార టీఆర్ఎస్ నేతల కన్నుపడిందని.. ఎకరాకు రూ.కోటి ఉన్న భూమిని రూ.10 లక్షలకే అమ్మాలని భూముల హక్కుదారుల్ని బెదిరిస్తున్నారని ఈటల వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ లోనూ వేలాది ఎకరాల గిరిజనుల భూములను లాక్కొనే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ‘‘ కేసీఆర్ కి అధికారం కట్టబెట్టింది భూములు లాక్కోవడానికేనా ? 6 నెలల తర్వాత టీఆర్ఎస్ ని ప్రజలు బొంద పెడతారు’’ అని ఈటల కామెంట్ చేశారు.
మానేరు డ్యామ్ నుంచి ఇసుక తీయడంతో భూగర్భ జలాలు అడుగంటే ముప్పు పొంచి ఉందన్నారు. కేసీఆర్ బంధువులు కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా మానేరు డ్యామ్ నుంచి తరలిస్తున్నారని ఆరోపించారు. మానేరు ఇసుక సహజ వనరు అని.. దాన్ని స్థానిక అవసరాలకే వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘‘మానేరు ఇసుకతో కేసీఆర్ బంధుగణం.. జిల్లాకు చెందిన ఓ ముఖ్య టీఆర్ఎస్ నాయకుడి తండ్రి బిజినెస్ చేస్తున్నారు’’ అని ఈటల సంచలన ఆరోపణ చేశారు. ‘‘మానేరు డ్యాం నుంచి ఇసుక తరలింపు వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయి. దీనిపై తాను పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికి మామూళ్లు ముడుతుండటం తో ఎవరూ చర్యలు తీసుకోవట్లేదు. జిల్లా కలెక్టర్, సీపీ లు చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు.