రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి కలిసి ఉందనేది మోడీ నినాదమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం మేమే పథకాలను అమలు చేస్తున్నామని ఏ రాష్ట్రంలోనూ చెప్పుకోదన్నారు. ఎన్ఆర్ హెచ్ఎం కింద కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం వైద్యానికి ఖర్చు చేస్తోందని చెప్పారు. తనకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నందున.. కేంద్రం ప్రజలకు నేరుగా ఏది ఇవ్వొచ్చు.. రాష్ట్రంతో కలిపి ఏది ఇస్తుంది అనే దానిపై అవగాహన ఉందన్నారు. కానీ.. గ్రామాలు, జిల్లాల అభివృద్ధిలోనే రాష్ట్ర అభివృద్ధి ఉందనేది తెలంగాణ ప్రభుత్వం గ్రహించడం లేదని చెప్పారు. కొత్తగా ముఖ్యమంత్రి స్పెషల్ ఫండ్ పేరుతో.. వచ్చే నిధులన్నింటినీ కేవలం మూడు నియోజకవర్గాల అభివృద్దికి మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
ఈజీఎస్ పథకంలో 90% కేంద్ర నిధులు ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు 10% మాత్రమే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో హరితహారం కింద నాటే మొక్కలు, శ్మశాన వాటికలు, గ్రామాలలో వేసే రోడ్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతున్నాయని ఈటల రాజేందర్ అన్నారు. కేంద్రప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో జరుగుతున్న పనులకు.. కేసీఆర్ తన బొమ్మలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్ల కోసం మద్యం తాగించే సంప్రదాయాన్ని నేర్పుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో పరిపాలన గాలికి వదిలేసి.. మంత్రులు, ఎమ్మెల్యేలంతా మునుగోడు మీద పడ్డారని ఈటల విమర్శించారు.