అధికారంలోకి రాగానే జీవో 69ని అమలు చేస్తాం : ఈటల రాజేందర్

మక్తల్, వెలుగు : బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మక్తల్  నియోజవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న జీవో 69ని అమలు చేస్తామని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్​ ఈటల రాజేందర్  హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మక్తల్​లో బీజేపీ అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్  మీటింగులో ఈటల మాట్లాడారు. బీజేపీ నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్  చైర్​పర్సన్​ను గెలిపించుకున్న గడ్డ ఈ మక్తల్  అడ్డా అని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో మక్తల్​ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కేసీఆర్​తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు అహంకారం ఎక్కువైందన్నారు. అవినీతి సీఎంను గద్దె  దింపాలని.. ఉద్యమ సమయంలో ఉపాసమున్న వ్యక్తి, పదేండ్లు సీఎంగా అధికారంలో ఉండి వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నాడని విమర్శించారు.

మక్తల్​లో అవినీతి పాలన పోవాలంటే ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి జలంధర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోలార్​ ఎంపీ మునిస్వామి, నాగురావు నామాజీ, కొండయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, బలరాం రెడ్డి. మున్సిపల్  చైర్​పర్సన్​​పావని, వైస్​ చైర్​పర్సన్​ అఖిల పాల్గొన్నారు.