బీజేపీపై ఉన్న కోపాన్ని రైతుల మీద చూపిస్తున్న కేసీఆర్

హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్ సర్కారు కూలిపోవడం ఖాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి పంటను కొనుగోలు చేస్తామని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసమే పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ బీజేపీపై ఉన్న కోపాన్ని రైతులపై చూపెడుతున్నారని ఈటల మండిపడ్డారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఓ ఏజెన్సీగా మాత్రమే పని చేస్తుందన్న ఆయన అందుకు అవసరమైన డబ్బును కేంద్రమే ఇస్తుందని స్పష్టం చేశారు. 

వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత గందరగోళ పరిస్థితుల్లో ఉందని ఈటల వాపోయారు. కేసీఆర్ సర్కారుకు ముందు చూపులేక, చిన్న చూపు చూడటం వల్లే సమస్య ఉత్పన్నమవుతోందని విమర్శించారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసిన ఈటల... రైతులు పండించిన వడ్లను పార్టీ కార్యాలయాలు, ఇళ్ల ముందు పోస్తామని కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

ఎస్టీల రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన మాట వాస్తవమేనని అన్నారు ఈటల. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.

For more news..

ఈ నెల 31తో కరోనా నిబంధనలు ఎత్తివేత!

ఉత్తరాఖండ్లో కొలువుదీరిన కొత్త సర్కారు