ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఈడీ దాడులకు భయపడం.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్​ రెడ్డి

వీణవంక, వెలుగు : టీఆర్​ఎస్ ​లీడర్లు ఈడీల దాడులకు భయపడరని, సీబీఐ, ఈడీలకు భయపడేది ఈటల రాజేందర్ మాత్రమే అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం వీణవంక మండల ప్రజా పరిషత్ ఆఫీస్​లో రూ.57 లక్షల విలువల గల కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. చెక్కుల పంపిణీ ఉందని అధికారులు సమాచారం ఇచ్చినా కార్యక్రమానికి రాకపోవడం సిగ్గుచేటని, ఈటలకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ప్రధాని మోడీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200 పెంచుతుంటే కనీసం మాట్లాడని ఈటల, హుజూరాబాద్ కి ఏమో చేస్తా అని ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాడన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రేణుక, జెడ్పీటీసీ మాధవరెడ్డి, సింగల్ విండో అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి, ఎమ్మార్వో రాజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మంత్రి హరీశ్​రావును కలిసిన టీచర్లు

సిరిసిల్ల టౌన్, వెలుగు : ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావును ఎస్ జీటీ టీచర్లు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రైమరీ స్కూళ్లలో  తరగతికి ఒక ఉపాధ్యాయుడిని, స్కావెంజర్లను, హెడ్మాస్టర్ పోస్టులను వెంటనే నియమించాలన్నారు. ప్రాథమిక స్థాయిలో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంను వందశాతం సక్సెస్ చేస్తామని అన్నారు. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు టీచర్లు తెలిపారు. వారిలో  సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 


దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే రమేశ్​బాబు

వేములవాడ, వెలుగు : దళితుల అభ్యున్నతి కోసమే  ప్రభుత్వం కృషి చేస్తోందని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్​బాబు అన్నారు. వేములవాడ అర్బన్ మండలంలో శుక్రవారం రూ.70 లక్షల విలువగల 7 దళితబంధు యూనిట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దళితులు స్వయం ఉపాధితో డెవలప్​కావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు ప్రారంభించారన్నారు. అనుపురం, కొడుముంజ, శాభాష్​పల్లి, చీర్లవంచ, చంద్రగిరి గ్రామాల్లో దళితబంధు యూనిట్ లను ప్రారంభించామన్నారు. మొదటి విడతలో నియోజకవర్గంలో 100 యూనిట్లు ఇచ్చామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్, జెడ్పీ చైర్ పర్సన్​ అరుణ, ఎంపీపీ  వజ్రమ్మ, జెడ్పీటీసీ రవి, లీడర్లు పాల్గొన్నారు. 

దివ్యాంగుల సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు  


కోరుట్ల, వెలుగు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు అన్నారు. శుక్రవారం కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో ప్రభుత్వం మంజూరు చేసిన స్కూటీలను ఎమ్మెల్యే దివ్యాంగులకు పంపిణీ చేశారు. అనంతరం సర్పరాజ్ పూర్ గ్రామానికి చెందిన బండారి నర్సయ్య అనే రైతు ఇటీవల మరణించగా ఆయన కుటుంబానికి  రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కు ను అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్​పర్సన్ లావణ్య, కౌన్సిలర్లు, నాయకులు  పాల్గొన్నారు.