పచ్చని పొలాల్లో ..ఇథనాల్​ చిచ్చు

  •     గుండంపల్లి వద్ద ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతుల అభ్యంతరాలు
  •      పంట పొలాలకు కాలుష్య ముప్పుపై ఆందోళన
  •     వెల్లువెత్తుతున్న నిరసనలు

నిర్మల్, వెలుగు :  పచ్చని పంట పొలాలకు నెలవైన నిర్మల్​ జిల్లాలోని దిలావర్​పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వ్యవహారం చిచ్చు పెడుతోంది. దశాబ్దాల నుంచి ఈ గ్రామం వ్యవసాయంలో ముందు వరుసలో నిలుస్తోంది. వరి, మొక్కజొన్న పంటలతో పాటు కూరగాయలు, వాణిజ్య పంటలను రైతులు ఇక్కడ పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పెద్ద మొత్తంలో దిగుబడులు సాధిస్తున్నారు. 

ఇలా పంట పొలాలనే నమ్ముకుని ఆనందంగా జీవిస్తున్న గుండంపెల్లి గ్రామంలో ఓ ప్రైవేటు సంస్థ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుండడం రైతుల వ్యతిరేకతకు కారణమవుతోంది. ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దంటూ రైతులు మొరపెట్టుకుంటున్నా యాజమాన్యం మాత్రం మొండి వైఖరితో ఫ్యాక్టరీని ఇక్కడే ఏర్పాటు చేస్తామని, ఎలాంటి కాలుష్య ముప్పు ఉండదని వాదిస్తోంది. ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవద్దంటూ రైతులు అటు యాజమాన్యానికి ఇటు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళన బాట పట్టారు. గుండంపల్లి రైతులు దిలావర్​పూర్ మండల కేంద్రంలో నిరసనలు కొనసాగిస్తున్నారు.

ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం

హైదరాబాద్​కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ గుండంపల్లి వద్ద దాదాపు వంద కోట్ల వ్యయంతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తుండడం స్థానికంగా దుమారం సృష్టిస్తోంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా వెలుపడే కాలుష్యం తమ ఆరోగ్యాలపై ప్రభావం చూపడమే కాకుండా పంట పొలాలకు నష్టం కలిగిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమ పచ్చని పంట పొలాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని, గతంలో మాదిరి స్వచ్ఛమైన వాతావరణం ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పరిశ్రమల ఏర్పాటుకు ఇతర చోట్ల స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ యాజమాన్యం మాత్రం తమ గ్రామం లోనే ఎందుకు ఏర్పాటు చేస్తుందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటును తాము అడ్డుకుంటామని, యాజమాన్యం మొండికేస్తే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని గుండంపల్లి రైతులు హెచ్చరిస్తున్నారు.

కాలుష్యం ఉండదంటున్న యాజమాన్యం

గుండంపల్లి వద్ద ఏర్పాటు చేయబోతున్న ఇథనాల్ ఫ్యాక్టరీతో ఎలాంటి కాలుష్యం ముప్పు ఉండదని పీఎంకే సంస్థ వెల్లడిస్తోంది. జీరో పొల్యూషన్ పద్ధతిలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామని.. కేవలం మొక్కజొన్న, వరి తోనే ఇథనాల్ తయారు చేయనున్న కారణంగా కాలుష్య సమస్య ఉండదని, పరిశ్రమ నిర్వహణ వల్ల దుర్వాసన కూడా వెలువడదని యాజమాన్యం చెబుతోంది. చెరుకుతో తయారు చేసే ఇథనాల్ ద్వారా కాలుష్యం వెలువడుతుందని, కానీ తాము కేవలం మొక్కజొన్న, వరితోనే ఇథనాల్ తయారు చేస్తున్నందున కాలుష్యం సమస్య ఉండదని అంటోంది. 

ఈ ప్రాంతంలో సాగయ్యే మొక్కజొన్న, వరి పంటలను ప్రభుత్వ మద్దతు ధరకే తాము కొనుగోలు చేస్తామని, నాణ్యతను సైతం పెద్దగా పరిగణలోకి తీసుకోమని ఆ కంపెనీ యాజమాన్యం పేర్కొంటోంది. పరిశ్రమ నిర్వహణలో వెలువడే వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చేందుకు ప్రత్యేక యూనిట్ ను ఏర్పాటు చేస్తామని, రివర్స్ ట్యాంక్ పద్ధతిలో ఈ ఎరువును తయారు చేస్తామని వివరిస్తోంది. 

పంటలకు నష్టమే.. 

ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుతో పంట పొలాలకు నష్టం జరుగుతుంది. కాలుష్య కారకాలు పంటలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. భూగర్భ జలాలు విషపూరితమవుతాయి. ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయవద్దని ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశాం. ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం.
-
 రాజన్న,  రైతు, గుండంపెల్లి