ఇథనాల్ ఫ్యాక్టరీపై నీలినీడలు

  • ఇథనాల్ ఫ్యాక్టరీపై  నీలినీడలు
  • ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం
  • పోలీస్ పహారాలో కొనసాగుతున్న పనులు
  • ఆందోళనలకు సిద్ధమవుతున్న మెట్లచిట్టాపూర్ గ్రామస్తులు

మెట్ పల్లి, వెలుగు: మండలంలోని మెట్లచిట్టాపూర్ శివారులో తలపెట్టిన ఇథనాల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమకు ఫ్యాక్టరీలు వద్దంటూ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేయడం చర్చనీయంశంగా మారింది. మెట్లచిట్టపూర్ లో భువి బయోకెమికల్స్, ధాత్రి బయోకెమికల్స్ సంస్థలు రూ.1,040 కోట్ల పెట్టుబడితో ఇథనాల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకువచ్చాయి. సర్కారు ఆదేశాలతో 2021లో రెవెన్యూ శాఖ అధికారులు మెట్లచిట్టాపూర్ శివారులోని సర్వే నం.498లో 197 ఎకరాలను తెలంగాణ పరిశ్రమల శాఖకు కేటాయించారు. ఈ ఏడాది జూన్ 10న మెట్ పల్లిలోఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో పరిశ్రమల శాఖ అధికారులు, భువి, ధాత్రి బయోకెమికల్స్ ప్రతినిధుల మధ్య, ఎంఓయూ కుదుర్చుకున్నారు.

పనులు అడ్డుకున్న గ్రామస్తులు..

అంతర్గత రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పించిన తర్వాత పరిశ్రమల శాఖ భువి, ధాత్రి సంస్థలకు భూమిని అప్పగిస్తుంది. అనంతరం పరిశ్రమల స్థాపన కోసం పనులు ప్రారంభం అవుతాయి. అయితే ఫ్యాక్టరీల కోసం కేటాయించిన స్థలంలో మౌలిక వసతులు చేపడుతున్న విషయం తెలుసుకున్న మెట్లచిట్టాపూర్ గ్రామస్తులు పనులు అడ్డుకున్నారు. కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీలు తమకొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం గ్రామ సర్పంచ్ బద్దం శేఖర్ రెడ్డి నేతృత్వంలో గ్రామస్తులు గ్రామ సభ నిర్వహించి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయొద్దంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తమ గ్రామానికి చెందిన సర్కారు  భూమిలో ప్రైవేట్ సంస్థలు పరిశ్రమలు నిర్మించొద్దని, ప్రభుత్వం వెంటనే ఆ భూమిని వెనక్కి తీసుకుని గ్రామానికే చెందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల నిర్ణయం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, నాయకులకు మింగుడుపడడం లేదు. ఫ్యాక్టరీల ఏర్పాటుకు మొగ్గు చూపితే గ్రామస్తుల్లో వ్యతిరేకత, గ్రామస్తుల నిర్ణయాన్ని ఆమోదిస్తే సర్కారు నుంచి చేదు అనుభవం ఎదురవుతుందని లీడర్లు మిన్నకుంటున్నారు.

పోలీస్​ల పహారాలో పనులు

గ్రామస్తులు ఆందోళన చేస్తుండడంతో పోలీస్​పహారా మధ్య 197 ఎకరాల్లో మౌలిక వసతులకు  సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీల పనులు నిలిపేత కోసం పెద్దఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

ఏకపక్ష నిర్ణయంతో గ్రామస్తుల ఆగ్రహం..

తమ నుంచి కనీస అభిప్రాయాలు తీసుకోకుండా ఇథనాల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎలా ఏర్పాటు చేస్తారని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామానికి చెందిన వందలాది ఎకరాల  భూమిని ప్రైవేట్ సంస్థలకు ఎలా కేటాయిస్తారని, కాలుష్యాన్ని వెదజల్లే ఇథనాల్ ఫ్యాక్టరీని గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేయడానికి ఎలా పర్మిషన్ ఇస్తారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే ఇదంతా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఓ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ముందు స్థానికుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అదేం చేయకుండా నేరుగా స్థలం కేటాయింపు, ఫ్యాక్టరీల  ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండటంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది.