తాగునీటి కోసం నీళ్లిడిస్తే.. ఇథనాల్​ ఫ్యాక్టరీకి మళ్లిస్తున్రు

తాగునీటి కోసం నీళ్లిడిస్తే.. ఇథనాల్​ ఫ్యాక్టరీకి మళ్లిస్తున్రు
  • పర్మిషన్​ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 
  • పది రోజులుగా జూరాల నుంచి   కోయిల్​సాగర్​కు నీటి విడుదల
  • సర్జ్​పూల్​ దగ్గర మోటార్లు, సబ్​స్టేషన్ ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ  
  • ఎనిమిదిన్నర కిలోమీటర్ల పైపులైన్ కూడా..
  • టీఎంసీ కెపాసిటీతో  చెరువు నిర్మాణం

మహబూబ్​నగర్, వెలుగు: గ్రామాలకు తాగునీరందించడానికి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్​సాగర్ ​ప్రాజెక్టుకు వదులుతున్న నీళ్లను ఇథనాల్ ఫ్యాక్టరీ దర్జాగా మళ్లించుకుపోతోంది. సర్కారు పర్మిషన్​తో పంప్​హౌస్​ దగ్గర మోటార్లను పెట్టి ఫ్యాక్టరీ వరకు ప్రత్యేకంగా పైపులైన్​ వేసుకుని మరీ పట్టుకుపోతోంది. పరిశ్రమ దగ్గర ఒక టీఎంసీ కెపాసిటీతో ఏర్పాటు చేసుకున్న 12 ఎకరాల చెరువులో ఈ నీళ్లను డంప్​చేసుకుంటోంది. అంతేగాక, ఉంద్యాల పంప్​హౌస్​దగ్గర మోటార్లను, జనరేటర్లను. సొంత సబ్​స్టేషన్​ను ఏర్పాటు చేసుకుని సొంత సిబ్బందిని కూడా నియమించుకుంది. ఇష్టమున్నప్పుడు మోటర్లను ఆన్​చేసుకుంటూ చెరువు నిండాక ఆఫ్​ చేసుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతి ఉండడంతో జిల్లా అధికారులు కూడా సహకరిస్తున్నారు. ఏడు మండలాల్లో జనాలు దూపకేడుస్తుంటే ఇథనాల్​ఫ్యాక్టరీ మాత్రం కావాల్సినన్ని నీళ్లతో పండుగ చేసుకుంటోంది. 

ఇలా పట్టుకుపోతున్నరు 

జూరాల బ్యాక్​వాటర్ ​నుంచి కోయిల్​సాగర్ ​కాల్వ ద్వారా ఉంద్యాల పంప్​హౌస్​వరకు నీళ్లు చేరతాయి. అక్కడి నుంచి అండర్​టన్నెల్​ ద్వారా పంప్​హౌస్​లోని సర్జ్​పూల్​లోకి నీళ్లు చేరితే మోటార్లను ఆన్​చేసి నీటిని ఎత్తిపోస్తారు. అయితే, ఇథనాల్​ఫ్యాక్టరీకి చెందిన మూడు మోటార్ల (ఒక్కో మోటార్​కెపాసిటీ 75 హెచ్​పీ)ను కూడా సర్జ్​ఫూల్​లోకి దింపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఫ్యాక్టరీ వారు పంప్​హౌస్​ దగ్గరే మినీ సబ్​స్టేషన్, జనరేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీ వరకు ఫీటున్నర పైపులైన్ ​వేసుకున్నారు. ఫ్యాక్టరీ పక్కనే సుమారు12 ఎకరాల్లో కృత్రిమంగా ఓ చెరువు నిర్మించుకుని ఈ పైపులైన్​కనెక్షన్​ ఇచ్చుకున్నారు. ఈ చెరువు కెపాసిటీ సుమారు ఒక టీఎంసీ ఉంటుందని అంచనా.  ప్రస్తుతం పంప్​హౌస్​దగ్గర ఉన్న జనరేటర్​ సాయంతో మోటార్లను ఆన్​ చేసి, తాగునీటి కోసం కేటాయించిన నీళ్లలో అవసరమైనంత వరకు ఫ్యాక్టరీ చెరువులోకి డంప్ ​చేస్తున్నారు. ఇందుకోసం పంప్​హౌస్​దగ్గర పని చేసే సిబ్బందిని కూడా ఇథనాల్​కంపెనీయే నియమించుకుంది. వీరే మోటార్లు, జనరేటర్లను ఆన్,​ ఆఫ్ చేస్తూ నీళ్లను తీస్కపోతున్నారు. ప్రతి రోజూ ఐదు నుంచి ఆరు గంటల వరకు  మోటార్లను రన్​ చేస్తూ నీటిని తరలిస్తున్నామని సదరు సిబ్బంది చెబుతున్నారు. ఇదంతా తెలిసినా..ప్రభుత్వ పర్మిషన్​ ఉండడంతో  స్థానిక ఇరిగేషన్​ఆఫీసర్లు  ఏమీ చేయలేకపోతున్నారు. ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​కు చెందిన సిబ్బందిని అడిగితే తమకు తమకు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన మోటార్ల గురించి గాని, జనరేటర్ల గురించి గాని తెలియదని చెబుతున్నారు. 

ఏడాదిన్నరగా ఫ్యాక్టరీ వద్దంటున్నా..  

నారాయణపేట జిల్లా మరికల్ ​మండలంలోని చిత్తనూరు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్​ఫ్యాక్టరీ వద్దంటూ చిన్ననూరు, ఎక్లాస్​పూర్​, రాంపూర్​, కన్మనూరు, జిన్నారం గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు ఏడాదిన్నరగా ఉద్యమం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల ఎఫెక్ట్​ అవుతున్న మహబూబ్​నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని 54 గ్రామాల్లో ఆయా గ్రామాల బాధితులు పాదయాత్రలు నిర్వహించారు. మార్చి 3, 2022న ఫ్యాక్టరీ వద్దంటూ చిత్తనూరు గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. అదే ఏడాది ఏప్రిల్​21న ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి ఆఫీసులో ఫిర్యాదు చేశారు. అలాగే హెచ్ఆర్​సీలో, పర్యావరణ శాఖలో కూడా కంప్లయింట్​చేశారు. అదే రోజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డిని కలిశారు. అప్పటి సుప్రీం కోర్టు చీఫ్​జస్టిస్​ఎన్వీ రమణను కలిసి న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఆయన ఫ్యాక్టరీ వద్ద పరిస్థితులపై రిపోర్ట్​ఇవ్వాలని నారాయణపేట కలెక్టర్​ను ఆదేశించారు. దీంతో గతేడాది జులై 27న ఫ్యాక్టరీ వద్దకు అధికారులు చేరుకొని గ్రామస్తులతో, కంపెనీ నిర్వాహకులతో మాట్లాడారు. అయితే, నిర్వాహకులు ఫ్యాక్టరీకి సంబంధించిన డాక్యుమెంట్లలో కొన్నింటిని మాత్రమే చూపించి, మిగతా డాక్యుమెంట్లు సబ్మిట్​ చేయడానికి టైం కోరినట్లు తెలిసింది. ఈ రిపోర్ట్​ను సీజేకు పంపించాల్సి ఉండగా, ఇంత వరకు సబ్మిట్​ చేయలేదు. ఇంతలోనే ఆయన పదవీ విరమణ కూడా చేశారు. 

ఏడు మండలాల్లో నీటి సమస్య

కోయిల్​సాగర్​ ప్రాజెక్టు ద్వారా నారాయణపేట, మహబూబ్​నగర్​ జిల్లాల్లోని దాదాపు 342 ఊర్లకు తాగునీరందుతోంది. ఈ ప్రాజెక్ట్​ కెపాసిటీ 2.277 టీఎంసీలు కాగా, జనవరి నెలలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో మార్చి15 నాటికి టీఎంసీ నీళ్లు తగ్గిపోయాయి. మే నాటికి డెడ్​స్టోరేజీకి చేరింది. దీంతో మరికల్, ధన్వాడ, హన్వాడ, మహబూబ్​నగర్​ మండలాల్లోని కొన్ని గ్రామాలకు, కోయిల్​కొండ, కోస్గి, మద్దూరు మండలాల్లోన్ని మరికొన్ని గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో ఆయా  ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు జూరాల బ్యాక్​వాటర్​ నుంచి కోయిల్​సాగర్​ ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ ​చేయాలని సర్కారు నిర్ణయించింది. జులై 3 నుంచి ఉంద్యాల లిఫ్ట్​-1 నుంచి పంపింగ్​స్టార్ట్​ చేశారు. జూరాల నుంచి కాల్వ ద్వారా నీటిని తరలించి, ఉంద్యాల వద్ద ఎత్తిపోసే పనులను దేవరదక్ర, మక్తల్​ఎమ్యెల్యేలు వెంటేశ్వర్​రెడ్డి, రాంమోహన్​రెడ్డి ప్రారంభించారు. 4న 233 క్యూసెక్కుల నీటిని, 5 వ తేదీ నుంచి మంగళవారం వరకు రోజుకు 315 క్యూసెక్కుల చొప్పున కోయిల్​సాగర్​కు తరలిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా..ఈ నీటిలో కొంత భాగాన్ని ఇథనాల్​ఫ్యాక్టరీకి తరలిస్తుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం కంపెనీకి నీళ్లను తరలించుకోవడానికి పర్మిషన్​ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గవర్నమెంట్​ పర్మిషన్ ​ఇచ్చింది.జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్​సాగర్​కు నీళ్లు తరలిస్తున్నాం. తాగునీటి కోసమే ఈ నీటిని తీసుకుంటున్నాం. ఇథనాల్​ ఫ్యాక్టరీకి ఉంద్యాల పంప్​హౌస్​ నుంచి నీళ్లు తోడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచే పర్మిషన్​ తెచ్చుకున్నారు. జిల్లా లెవల్​లో మేం అనుమతి ఇవ్వలేదు. 

- ప్రతాప్​సింగ్, 
ఈఈ, కోయిల్​సాగర్ ప్రాజెక్ట్​