- ఆగమేఘాల మీద కదిలిన ఫైళ్లు.. వెంటనే అనుమతులు
- డాక్యుమెంట్లు బయటపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు:నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులన్నీ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఇచ్చినట్లు స్పష్టమైంది. పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వని ఉత్పత్తులకు కూడా కేసీఆర్ ఆదేశించడంతో పర్మిషన్లు ఇచ్చినట్లు తేలింది. ఆ తరువాత జరిగిన కేబినెట్ భేటీలో ర్యాటిఫికేషన్లో భాగంగా వాటికి ఆమోదం తీసుకున్నట్లు స్పష్టమైంది. ఈ మేరకు దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమతులు, ఎవరి పేరు మీద ఉంది? ఎప్పుడెప్పుడు ఎలా ఫైల్స్‌కు ఆమోదం వచ్చిందనే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది.
ఈ కంపెనీకి టీఎస్‌ఐపాస్‌లో అప్లై చేసుకోగా.. నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యుల కోసం ఆగమేఘాల మీద పర్మిషన్లు ఇచ్చినట్లు తేలింది. వాస్తవానికి ఇథనాల్ కంపెనీలకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. మాజీ మంత్రి తలసాని బంధువు పుట్ట మహేశ్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, కుమారుడు సాయికిరణ్ అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న పీఎంకే డిస్టిలేషన్స్ కంపెనీ ఫ్యూయల్ ఇథనాల్ ఉత్పత్తి కోసం కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నది.
అయితే ఫ్యూయల్ ఇథనాల్ మాత్రమే ఉత్పత్తి చేయాల్సిన ఆ యూనిట్లో పర్యావరణ శాఖ అనుమతులను ఉల్లంఘిస్తూ.. ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూటల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ లాంటి అన్ని ఉత్పత్తి చేసేలా అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో అనుమతులు ఇచ్చారు. ఆ తరువాత ఈ అంశాన్ని ర్యాటిఫికేషన్ కింద రాష్ట్ర కేబినెట్లోనూ ఆమోదించారు. ఈ మేరకు అప్పటి సీఎం కేసీఆర్ సంతకాలు చేసిన ఫైల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టింది.
తీగ లాగితే డొంక కదిలింది
అడగడుగునా అక్రమ పర్మిషన్లతో దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు ఇవ్వడంతో వాటన్నింటిని రద్దు చేయాలని రాష్ట్ర సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పనులను నిలిపివేసింది. వాస్తవానికి ఐదారురోజుల కింది వరకు ఇథనాల్ ఫ్యాక్టరీ అంశం పెద్దగా బయటకు రాలేదు. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ ఇటీవల దిలావర్పూర్ గ్రామ ప్రజలతో పాటు గుండంపల్లి, బన్సపల్లి, సముందర్‌పల్లి గ్రామాల రైతులు ఆందోళనలకు దిగారు.
చర్చలు జరిపేందుకు వెళ్లిన ఆర్డీఓను నిర్బంధించారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం తాము కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా.. ఈ స్థాయిలో ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలనుకుంది. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ కథ ఏందో వెలికితీయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.. ఈ ఫ్యాక్టరీకి గత రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చినట్లు తేలింది.
కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన పర్మిషన్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఉత్పత్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి తలసాని కుటుంబ సభ్యులు ఉండటంతో పాటు.. అనుమతులన్నీ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే జరిగినట్లు ట్విట్టర్ వేదికగా సీఎం సీపీఆర్వో వెల్లడించారు.