- దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకినాడు అడ్డగోలుగా పర్మిషన్లు
- పీఎంకే కంపెనీకి వంతపాడిన గత బీఆర్ఎస్ సర్కార్
- ఇష్టమున్నట్లు మినహాయింపులు.. గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం
- 2022లో ఫ్యూయల్ ఇథనాల్ పేరు చెప్పి కేంద్రం నుంచి అనుమతి
- కానీ.. ఇథనాల్, ఈఎన్ఏ, ఇండస్ట్రియల్ స్పిరిట్స్ ఉత్పత్తికి నాటి బీఆర్ఎస్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
- ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ప్రత్యేక మినహాయింపు
- ‘అత్యవసరం’ పేరిట కేబినెట్ ఆమోదం లేకుండానే ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ కంపెనీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినట్లు తేలింది. నిబంధనలు అన్నీ తుంగలో తొక్కి.. అనేక మినహాయింపులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వైరీలో గుర్తించింది. దిలావర్పూర్లో ఇథనాల్ఫ్యాక్టరీకి సంబంధించి స్థానికుల నుంచి ఆందోళనలు వ్యక్తం కావడంతో దీనిపై ప్రభుత్వం రిపోర్ట్ తెప్పించుకున్నది. ఇందులో పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కంపెనీ ఉల్లంఘించినట్లు వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్ కు అనుమతి ఇస్తే.. అదేమీ పట్టించుకోకుండా ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్(ఈఎన్ఏ), ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ లాంటి అన్ని ఉత్పత్తులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గంలో అనుమతులు ఇచ్చారు. అదీ కూడా ర్యాటిఫికేషన్లో తీసుకున్నట్లు తేలింది. ఇక ఫ్యూయల్ ఇథనాల్ సాకును చూపించి ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మినహాయింపు పొందేందుకు ఈ కంపెనీ అడ్డదారులు అనుసరించిందని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ) నుంచి ఈ కంపెనీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తీసుకోవటం తప్పనిసరి. కానీ, పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థానికంగా అనుమతి తీసుకోకుండానే కాంపౌండ్ వాల్ నిర్మించినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
2022 అక్టోబర్ లో 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ తయారీకి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. అప్పటి రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేకుండానే ‘అత్యవసరం’ పేరిట ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఆ ఏడాది డిసెంబర్ లో కేబినెట్ ఈ నిర్ణయాన్ని ర్యాటిఫై చేసినట్లు పేర్కొన్నారు. ఇథనాల్ తయారీకి కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అనుమతి తీసుకోవటం తప్పనిసరి. లెటర్ ఆఫ్ ఇండెంట్లో ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ తయారీని అని పేర్కొన్నారు. కానీ.. కేంద్ర పర్యావరణ శాఖకు మాత్రం ‘ఫ్యూయల్ ఇథనాల్’ కోసమని దరఖాస్తు చేశారు. ఇలా కంపెనీ సమర్పించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఈ ఫ్యాక్టరీ బీ2 కేటగిరీకి వస్తుందని చెప్పి ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపు పొందారు.