దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్

దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్

నిర్మల్ జిల్లా: దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ వ్యవహారంపై పునరాలోచించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇచ్చిన పర్మిషన్పై రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఇథనాల్‌ పరిశ్రమ వద్దంటూ గ్రామస్తులు ఆందోళనను తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. గ్రామస్తులతో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ చర్చలు జరిపారు. ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు.

ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఐదు గ్రామాల ప్రజలు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. వెంటనే ఫ్యాక్టరీ పనులను నిలిపివేసి తరలించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్– గుండంపల్లి గ్రామాల మధ్య పరిశ్రమను నిర్మిస్తుండగా ఐదు గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 

ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటలకు దిలావర్పూర్ వద్ద  నిర్మల్ – భైంసా ప్రధాన రహదారిపై బైఠాయించారు. దిలావర్పూర్, గుండంపెల్లితో పాటు సముందర్ పల్లి , టెంబుర్ని, సిర్గాపూర్ కాండ్లీ  గ్రామాల రైతులు,  మహిళలు, పిల్లలు పాల్గొన్నారు.

ALSO READ | తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు

రాత్రి వరకు రాస్తారోకోను కొనసాగిస్తుండగా.. రైతులకు నచ్చచెప్పేందుకు వచ్చిన ఆర్డీఓ రత్న కళ్యాణిని అడ్డుకున్నారు. రాస్తారోకోతో ఇరువైపులా దాదాపు పది కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. సిర్గాపూర్ నుండి బీరవెల్లి , కాల్వ, గోలమాడ,  కుంటాల మీదుగా భైంసాకు మళ్లించారు. దిలావర్ పూర్ వద్ద ఆందోళన చేపట్టిన రైతులను సముదాయించేందుకు వచ్చిన ఆర్డీవో రత్న కల్యాణిని దాదాపు 8 గంటల పాటు నిర్బంధించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. 

దీంతో ఆగ్రహం చెందిన రైతులు ఆమె వాహనాన్ని ధ్వంసం చేశారు. ఎట్టకేలకు పోలీసులు ఆర్డీవోను నిర్మల్కు తరలించారు. ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలని రైతులు చేపట్టిన బంద్ రాస్తారోకో సంబంధించిన నివేదికను సీఎం ఆఫీసుకు కలెక్టర్ అభిలాష అభినవ్ పంపారు. రైతుల సమస్యను కూడా సీఎం ఆఫీస్కు నివేదికలో కలెక్టర్ వివరించారు.

అయినప్పటికీ దిలావర్ పూర్ లో హై టెన్షన్ బుధవారం కూడా కొనసాగింది. పోలీసులపై స్థానికులు రాళ్ల దాడికి దిగారు. పురుగు మందు డబ్బాలతో నిరసన తెలిపారు. డీఎస్పీ కారు అద్దాలను ధ్వంసం చేశారు. మండల కేంద్రంలోని హైవేపై రాస్తారోకోను కొనసాగించారు.