ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలి : టీజేఎస్, జేఏసీ లీడర్లు

  • హైకోర్టు స్టే అమలు చేయాలని టీజేఎస్, జేఏసీ లీడర్ల డిమాండ్

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని మెట్ల చిట్టాపూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ, ఫుడ్ ప్రాసెసింగ్  పనులను నిలిపివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను అమలు చేయాలని తెలంగాణ జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. మెట్ల చిట్టాపూర్ శివారులోని సర్వే నంబర్ 498, 506లో గత ప్రభుత్వాలు ఆ ప్రాంత నిరుపేద రైతులకు పట్టాలు పంపిణీ చేశాయని వారు తెలిపారు.

 

Also Read : కొత్త ప్రపంచాన్ని చూపించే..రాక్షస కావ్యం

సాగులో ఉన్న రైతులకు తెలియకుండానే ఇథనాల్ ఫ్యాక్టరీ, పుడ్  ప్రాసెసింగ్ ఇండ్రస్ట్రీ ఏర్పాటుకు సర్కారు ఏర్పాట్లు చేసిందని, రైతులకు పంచిన భూములను తిరిగి తీసుకోవడం అన్యాయమన్నారు. భూ నిర్వాసితులైన 25 కుటుంబాల రైతులు హైకోర్టును ఆశ్రయించారని, ప్రస్తుతానికి బాధిత రైతుల పక్షాన స్టేటస్ కో ఉత్తర్వులు రావడం సంతోషమన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట శంకర్, యువజన సమితి జిల్లా అధ్యక్షుడు కంతి రమేశ్, విద్యార్థి జన సమితి రాష్ట్ర కార్యదర్శి తరుణ్, జేఏసీ నాయకులు ఉన్నారు.