
బెజ్జంకి, వెలుగు : ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వచ్చిన కంపెనీ అడ్వైజర్‌ను బుధవారం గుగ్గిళ్ల పంచాయతీ ఆఫీసులో నిర్బంధించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్లలో నిర్మించనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ మూడు నెలలుగా గుగ్గిళ్ల, తిమ్మాయిపల్లి గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీ అడ్వైజర్ విజయ్, సూపర్వైజర్ సునీల్ అవగాహన కల్పించడానికి గుగ్గిళ్లకు వచ్చారు. ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పెట్రోల్‌లో వాడుకునే ఇథనాల్ లిక్విడ్ మాత్రమే తీస్తామని, హాని రసాయనాలు ఫ్యాక్టరీ నుంచి రావని చెప్పారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అడ్వైజర్, సూపర్వైజర్లను జీపీలో నిర్బంధించారు. దీంతో హైడ్రామా నెలకొంది. సిద్దిపేట రూరల్‌సీఐ శీను, బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి వచ్చి గ్రామస్తులను శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినలేదు. ఎలాగో సర్ది చెప్పి ఇద్దరీని బయటకు తీసుకువచ్చారు. సిద్దిపేట ఏసీపీ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి వచ్చి ఫ్యాక్టరీ పనులు ఆపేందుకు ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతో కొద్దిసేపు పనులను నిలిపివేయించారు.