ఫిబ్రవరి 9న ఏడుపాయల జాతర .. ఏడుపాయల్లో పూర్తికాని ఏర్పాట్లు

ఫిబ్రవరి 9న ఏడుపాయల జాతర .. ఏడుపాయల్లో పూర్తికాని ఏర్పాట్లు

మెదక్, పాపన్నపేట, వెలుగు: ఏటా మాఘ అమావాస్య రోజున పాపన్నపేట మండలంలోని ఏడుపాయలలో జాతర జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ నెల 9న జాతర ఉండగా.. అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఈ జాతరకు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్ష మంది వస్తారు.

ఏడుపాయలకు వచ్చే భక్తులందరూ ;మంజీరా నదీ పాయల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. అయితే ఘనపూర్​ ఆనకట్ట దిగువన, నదీపాయ ఒడ్డున, చెక్​ డ్యాం వద్ద, దుర్గామాత ప్రధాన ఆలయం ముందున్న నదీ పాయ వద్ద స్నాన ఘట్టాల వద్ద ఉన్న షవర్లకు నీటిని పంపింగ్​ చేసేందుకు మోటర్ల ఏర్పాటు పూర్తి కాలేదు.   అక్కడ మహిళలకు కోసం ఎలాంటి సౌకర్యాలు కనిపించడం లేదు. 

భక్తుల సంఖ్యకు అనుగుణంగా తాగునీటి వసతి, టాయిలెట్ సౌకర్యాలు ఇంకా సమకూర్చలేదు. దీంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఏడుపాయల ఆలయానికి ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నా ఆలయానికి వచ్చే భక్తులకు మాత్రం వసతులు కల్పనలో, పాలకవర్గం, అధికారులు విఫలమవుతున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఏడుపాయల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పాపన్నపేట ఎస్సై నరేశ్​ తెలిపారు. సుమారుగా 200 మంది పోలీసులతో జాతరలో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. 

ఏర్పాట్లు చేస్తున్నాం

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా. అందుకు అనుగుణంగా స్నానాల కోసం ఆలయం, చెక్ డ్యామ్, ప్రాజెక్ట్ వద్ద షవర్ బాత్​లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు టెంట్లు ఏర్పాటు చేస్తున్నాం. తల నీలాలు సమర్పించే వద్ద నీడకోసం టెంట్లు, ఆలయానికి వెళ్లే దారిలో చలువ పందిళ్లు, అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్​లు ఏర్పాటు చేస్తున్నాం. మాఘ అమావాస్య జాతర సందర్భంగా ఆర్టీసీ వివిధ డిపోల నుంచి స్పెషల్​ బస్సులు నడుపుతోంది. 

 బాలాగౌడ్​, ఏడుపాయల చైర్మెన్​