జెలెన్ స్కీకి యూరప్ బాసట..ఉక్రెయిన్​కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా 30కి పైగా దేశాల మద్దతు

జెలెన్ స్కీకి యూరప్ బాసట..ఉక్రెయిన్​కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా 30కి పైగా దేశాల మద్దతు

 

  • ట్రంప్ తీరుపై ఆస్ట్రేలియా, కెనడా కూడా విమర్శలు 
  • సొంత దేశంలోనూ ప్రతిపక్షాల నుంచి ట్రంప్​కు సెగ
  • మినరల్స్ డీల్​కు సిద్ధమే, కానీ.. మా భద్రతకు గ్యారంటీ కావాలి: జెలెన్ స్కీ
  • అమెరికన్లకు ఎప్పటికీ రుణపడి ఉంటామని వెల్లడి 
  • బ్రిటన్​కు చేరుకున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ 
  • నేడు యూరోపియన్ నేతలతో కీలక మీటింగ్

కీవ్/లండన్:ఉక్రెయిన్​తో మినరల్స్ డీల్​పై చర్చల సందర్భంగా శుక్రవారం వైట్ హౌస్​లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీకి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కు మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచదేశాల్లో ప్రకంపనలు రేపింది. జెలెన్ స్కీపై వైట్ హౌస్ లో మీడియా ముందే ట్రంప్, వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. రష్యాతో యుద్ధం విషయంలో తాము జెలెన్ స్కీకి అండగా ఉంటామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నార్వే, టర్కీ, స్వీడన్, లాట్వియా, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ సహా 30కిపైగా యూరోపియన్ దేశాలు ప్రకటించాయి. ఆయా దేశాల అధినేతలు ‘ఎక్స్’లో జెలెన్ స్కీ టైమ్ లైన్ లో ఈ మేరకు వరుస ట్వీట్లతో మద్దతు ప్రకటించారు. 

ఆస్ట్రేలియా, కెనడా కూడా ట్రంప్ తీరును తప్పుపట్టాయి. తనకు మద్దతు ప్రకటించిన దేశాలన్నింటికీ జెలెన్ స్కీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఆదివారం యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ సదస్సులో కీలక సమావేశంలో పాల్గొనేందుకు జెలెన్ స్కీ శనివారం మధ్యాహ్నం లండన్ చేరుకున్నారు. సాయంత్రం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తోనూ ఆయన భేటీ కానున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, శుక్రవారం వైట్ హౌస్ లో మినరల్స్ డీల్ పై జెలెన్ స్కీ, ట్రంప్ సంతకాలు చేయాల్సి ఉండగా.. ఉక్రెయిన్ భద్రతకు గ్యారంటీ ఇవ్వనిదే డీల్ కు ఒప్పుకోబోమని జెలెన్ స్కీ తేల్చిచెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నర హంతకుడని, ఆయనను నమ్మబోమన్నారు. దీంతో జెలెన్ స్కీ శాంతి ఒప్పందానికి సిద్ధంగా లేరని ట్రంప్ విమర్శించారు. ప్రజల ప్రాణాలతో జూదం ఆడుతున్నారని, సాయం చేసిన తమనే అవమానిస్తున్నారని అన్నారు. మీడియా సమావేశంలోనే తీవ్ర వాగ్వాదం జరగడంతో ఈ మీటింగ్ అర్ధంతరంగా ముగిసింది. 

మినరల్స్ డీల్​కు సిద్ధమే, కానీ..: జెలెన్ స్కీ

వైట్​హౌస్​లో ట్రంప్, వాన్స్​తో వాగ్వాదం తర్వాత జెలెన్ స్కీ శుక్రవారం వరుసగా ట్వీట్లు చేశారు. అమెరికన్లు తమకు వ్యూహాత్మక భాగస్వాములని, తమ మనుగడకు ఎంతో సాయం చేశారన్నారు. శనివారం కూడా ఆయన ఈ విషయంపై స్పందించారు. శాంతిని కోరుకున్నందుకే తాను ట్రంప్​తో మినరల్స్ డీల్​కు ఒప్పుకున్నానని, అందుకే అమెరికా వెళ్లానన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలోనూ శాంతి ఒప్పందాలను ఉల్లంఘించారని, అందుకే భవిష్యత్తులో తమ భద్రతకు గ్యారంటీ కావాలని అడిగానన్నారు. ఉక్రెయిన్ మనుగడ కోసం చేసిన సాయానికి అమెరికన్ నాయకత్వం, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల మధ్య ఇకపైనా బలమైన సంబంధాలు కొనసాగుతాయని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. 

‘‘రష్యా మాపై దాడి చేస్తున్న ఈ మూడేండ్లు అమెరికన్లు ఎంతో సాయం చేశారు. మా ప్రాణాలను కాపాడుకునేందుకు అండగా నిలిచారు. ఇందుకుగాను అమెరికా అధ్యక్షుడికి, అమెరికన్లు అందరికీ మేం రుణపడి ఉంటాం. ఉక్రెయిన్ లో అరుదైన ఖనిజాలను అమెరికా తవ్వకునేందుకు అంగీకరిస్తూ మేం మినరల్స్ డీల్ కుదుర్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది మా భద్రతకు గ్యారంటీల దిశగా తొలి అడుగు అవుతుంది. అయితే, ఇది మాత్రమే చాలదు. మాకు ఇంతకంటే ఎక్కువ గ్యారంటీలు కావాలి. భద్రతాపరమైన హామీలు లేకుండా కాల్పుల విరమణ అంటే ఉక్రెయిన్ కు ప్రమాదం. మేం మూడేండ్లుగా పోరాడుతున్నాం. అమెరికా మా వైపునే ఉందని ఉక్రెయిన్ ప్రజలకు చాటిచెప్పాలి. అమెరికాతో మా రిలేషన్షిప్ కేవలం ఇద్దరు లీడర్లకు సంబంధించినది కాదు. అంతకంటే ఎక్కువ. రెండు దేశాల ప్రజల మధ్య బలమైన చారిత్రక బంధాలు ఉన్నాయి. అందుకే మేం ఎల్లప్పుడూ అమెరికాకు రుణపడి ఉంటామనే స్పష్టం చేస్తున్నా” అని జెలెన్ స్కీ పేర్కొన్నారు.

ట్రంప్​పై డెమోక్రాట్ల మండిపాటు 

ట్రంప్​తో మీటింగ్ అర్ధంతరంగా ముగిసిన అనంతరం జెలెన్ స్కీని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కలిశారు. మీడియా సమావేశంలో జరిగిన వాగ్వాదానికి గాను ట్రంప్​కు క్షమాపణలు చెప్పాలని కోరారు. అయితే, జెలెన్ స్కీ అందుకు తిరస్కరించారు. అమెరికన్లు తమకు ఎంతో సాయం చేశారని, కానీ ట్రంప్ తో జరిగిన వాగ్వాదంలో తాను తప్పేమీ చేయలేదన్నారు. కాగా, జెలెన్ స్కీతో వాగ్వాదంలో ట్రంప్ తీరును వైట్ హౌస్ సమర్థించగా.. ప్రతిపక్ష డెమోక్రాట్ నేతల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మీడియా సమావేశంలోనే ఒక దేశ అధ్యక్షుడితో అలా వ్యవహరించడం సరికాదని పలువురు నేతలు విమర్శించారు. అమెరికా విదేశాంగ విధానానికి ఇది దుర్దినమని, ట్రంప్, వాన్స్ ఇద్దరూ పుతిన్ కు సేవకులుగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. ఇక జెలెన్ స్కీకి సొంత దేశంలోనూ ప్రజలు, నేతలు మద్దతు పలికారు. దేశం కోసం చేస్తున్న పోరాటంలో ఆయన దృఢ సంకల్పం చాటారని కొనియాడారు.