Elon Musk: టార్గెట్ మస్క్.. ఎక్స్‌పై యూరోపియన్ యూనియన్ పెనాల్టీ ప్లాన్..!

Elon Musk: టార్గెట్ మస్క్.. ఎక్స్‌పై యూరోపియన్ యూనియన్ పెనాల్టీ ప్లాన్..!

Penalty on Elon Musk: ప్రస్తుతం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పరిస్థితి అస్సలు ఏమాత్రం బాలేదు. టెస్లా నుంచి ఎక్స్ వరకు ఆయన వ్యాపారాలు ప్రస్తుతం ప్రతికూలతల్లో కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి సపోర్ట్ చేయటంతో టెస్లాపై దాడులతో పాటు కంపెనీ అమ్మకాలు భారీగా పడిపోవటం ప్రపంచ కుబేరుడికి ఆందోళన కలిగిస్తోంది.

ఇదే క్రమంలో యూరోపియన్ యూనియన్ నియంత్రణ సంస్థలు చట్టవిరుద్ధమైన కంటెంట్, తప్పుడు సమాచారాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన కీలక చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ పై భారీ జరిమానా విధించేందుకు సిద్ధమౌతున్నాయని వెల్లడైంది. దీనికి తోడు అనేక మార్పులను కూడా వారు డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి యూరోపియన్ తీసుకొచ్చిన కొత్త డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద ఇది తొలి చర్యగా ఉండనుంది.

సమాచారం ప్రకారం యూరోపియన్ యూనియన్ ఎక్స్ పై రూ.8వేల 500 కోట్ల వరకు పెనాల్టీ విధించవచ్చని తెలుస్తోంది. అంటే అమెరికా కరెన్సీ ప్రకారం దాదాపు 1 బిలియన్ డాలర్లుగా ఈ పెనాల్టీ ఉండనుంది. అయితే అమెరికాతో వాణిజ్య విధానాలు, సుంకాలు, ఉక్రెయిన్‌లో యుద్ధంపై ట్రంప్‌తో ప్రస్తుత ఉద్రిక్తతలతో సహా భౌగోళిక రాజకీయ చిక్కులను దృష్టిలో ఉంచుకుని ఈయూ దేశాలు మస్క్ కంపెనీపై జరిమానాను నిర్ణయించవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో జరిమానా విలువ మరింతగా పెరిగే ప్రమాదం కూడా ఉంది. 

Also Read:-ఈ సీఈవో దేవుడు సామీ.. లేఆఫ్ చేసి కొత్త ఉద్యోగాలిప్పించాడు..!

వాస్తవానికి చట్టపరమైన కంటెంట్ నిర్వహణతో పాటు కంటెంట్ ఆల్టరేషన్ కి సంబంధించిన డిజిటల్ సర్వీసెస్ చట్టం ఉల్లంఘన విషయంలో ఎక్స్ డిసెంబర్ 2023 నుంచి దర్యాప్తులో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రాజకీయ పార్టీలకు లబ్ధి చేకూరేలా ఎక్స్ తన సాంకేతికతను వినియోగించిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పట్లో ఈయూ అధికారులు చట్టాల ఉల్లంఘనపై నోటీసులు ఇచ్చింది. అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్స్‌కి ఈ దర్యాప్తుకు ఎలాంటి సంబంధం లేదని స్వతంత్రంగా ప్రక్రియ సాగుతోందని అంటున్నారు.  

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15 నాటికి ఎక్స్ వాడుతున్న అంతర్గత ఆల్గారిథమ్స్, రికమండర్ సిస్టమ్స్ వివరాలను పంచుకోవాలని సూచించింది. అయితే ఎక్స్ అక్కడి ప్రభుత్వం అడిగిన మార్పులను చేసేందుకు ముందుకు వస్తే వివాదాన్ని సానుకూలంగా ముగించి పరిష్కరించుకునేందుకు అవకాశం లభిస్తుందని ఒక అధికారి వెల్లడించారు. దీనిపై మస్క్ ఎలా ముందుకెళతారనే విషయం వేచి చూడాల్సిన అంశంగా ఉంది.