
- ఉమెన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్
- అనంతరం సబ్సిడీపై ఈవీ ఆటోల అందజేత
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన కార్పొరేషన్
- త్వరలో అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ ట్రైనింగ్ షురూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోల ఫ్రీ డ్రైవింగ్, టూ వీలర్ డ్రైవింగ్ ను నేర్పిస్తున్నారు.18 ఏండ్ల నుంచి 45 ఏండ్ల మహిళలకు 45 రోజుల నుంచి 60 రోజుల పాటు కూకట్ పల్లిలోని కార్పోరేషన్ కు చెందిన డీఎంఎస్ వీకే ( దుర్గాబాయ్ మహిళ శిశు వికాస కేంద్రం)లో ఉన్న డ్రైవింగ్ ట్రాక్ లో ఉదయం, సాయంత్రం ట్రైనింగ్ కొనసాగుతోంది.
ఈ కేంద్రంలో ఉన్న డ్రైవింగ్ ట్రాక్ లో ట్రైనర్లు డ్రైవింగ్ నేర్పించిన తర్వాత, క్లాస్ రూమ్ లో ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తుండగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. గతేడాది ఆగస్ట్ లో ట్రైనింగ్ స్టార్ట్ కాగా.. ఇప్పటి వరకు 45 మందికి డ్రైవింగ్ పూర్తయింది. వచ్చే నెల 5 నుంచి మరో బ్యాచ్ స్టార్ట్ కానుంది.
వీరికి లెర్నింగ్ లైసెన్స్ ఇప్పించి డ్రైవింగ్ పూర్తయ్యాక కార్నోరేషన్ ఆర్టీఏ అధికారులతో సమన్వయం చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తోంది. మొత్తం 100 మంది ఈవీ ఆటో, టూ వీలర్ నేర్చుకునేందుకు పేర్లు రిజిస్ర్టర్ చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఒక్కో బ్యాచ్ కు 30 మంది చొప్పున 15 బ్యాచ్ ల ద్వారా 400 మందికి ట్రైనింగ్ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు.
సబ్సిడీ మీద ఆటోల అందజేత
డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు సబ్సిడీతో ఈవీ ఆటోలు ఇచ్చేందుకు కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కో ఆటో రూ.4 లక్షలు ఉందని.. ఇందులో 70% సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వనుండగా మరో 30% తక్కువ వడ్డీకి మహిళకు రుణం ఇప్పిస్తామని కార్పొరేషన్ చైర్మన్ శోభరాణి తెలిపారు. హైదరాబాద్ లో మొత్తం వెయ్యి ఈవీ ఆటోలకు డిమాండ్ ఉందని, కార్పొరేషన్ ద్వారా దశల వారీగా నిరుద్యోగ మహిళలకు ఈవీ ఆటోలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు.
పేద, మధ్యతరగతి మహిళలు పిల్లలను స్కూల్కు పంపాక ఖాళీగా ఉంటున్నారని, ఇలా డ్రైవింగ్తో పాటు కుట్టుమిషన్లు, అల్లికలు నేర్చుకోవటం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చన్నారు. డీఎంఎస్ వీకే లో హాస్టల్ వసతి కూడా ఉందనితెలిపారు. డ్రైవింగ్ తో పాటు కుట్టు మిషన్, అల్లికలు, బ్యూటిషియన్, మగ్గం, జ్యూట్ బ్యాగుల తయారీ కూడా నేర్పిస్తామని, త్వరలో బ్యాచ్ లు స్టార్ట్ చేస్తున్నామని డీవీఎంకే డైరెక్టర్ వైష్ణవి తెలిపారు.
జిల్లాల్లో త్వరలో ట్రైనింగ్
ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు 10 ఉమ్మడి జిల్లాల్లో 10 ఎకరాల్లో సొంత బిల్డింగ్ లు, ఖాళీ ప్లేస్ లు ఉన్నాయి. వీటిలో డ్రైవింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడంతో పాటు త్వరలో జిల్లాల్లోనూ మహిళలకు ఆటో డ్రైవింగ్ , టూ వీలర్ ట్రైనింగ్ నేర్పించేందుకు కార్పోరేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల్లో ఈ ట్రైనింగ్ ను స్టార్ట్ చేస్తే భారీ స్పందన వస్తుందని మహిళా స్ర్తీ శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు.
డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ర్ట మంత్రులు తమ ఫండ్స్ నుంచి నిధులు ఇవ్వాలని, దీని వల్ల వాళ్ల ప్రాంత మహిళలకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై ఫండ్స్ కేటాయించాలని కోరుతామని చైర్మన్ శోభరాణి తెలిపారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో 10 ఎకరాల్లో బిల్డింగ్లు ఉండటం, ఏటా కొంత నిధులిస్తే మహిళలకు సెల్ఫ్ ఎంప్లాయి మెంట్ కల్పిస్తామన్నారు.
డ్రైవింగ్ శిక్షణ పూర్తయింది.. మౌనిక, జగద్గిరి గుట్ట
జగద్గిరిగుట్ట నుంచి వచ్చి ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకున్నాను. లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చి ట్రైనింగ్ నేర్పించారు. ఆటో నేర్చకున్నా, టూ వీలర్ కూడా నేర్చుకున్నాను. సబ్సిడీ ద్వారా ఆటో ఇస్తామని అధికారులు చెబుతున్నారు. తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామని, వీటిని ఈఎంఐల ద్వారా చెల్లించుకుంటాం. మా ఏరియాలో ఉన్న నిరుద్యోగ మహిళలకు ఇక్కడి ట్రైనింగ్ గురించి వివరించి, వాళ్లు జాయిన్ అయ్యేలా కృషి చేస్తాను.