దత్తత గ్రామమూ దయ చూపలే.. వాసాలమర్రిలో బీఆర్ఎస్​కు 41.73 శాతమే ఓట్లు

  • యాదగిరిగుట్టలో 28.1 శాతమే!
  • ఆశ్చర్యపరచిన పోలింగ్​ శాతం

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలోని మాజీ  సీఎం కేసీఆర్​ దత్తత గ్రామం వాసాలమర్రిలో బీఆర్ఎస్​కు సగం మంది కూడా ఓట్లేయలేదు. ఊరును దత్తత తీసుకొని మూడేండ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి  చేయకపోవడంతో తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో వ్యక్తం చేసినట్లు భావిస్తున్నారు. ఇక రూ. 1200 కోట్లతో  యాదగిరిగుట్ట టెంపుల్​ను పునర్నిర్మించిన్పటికీ  యాదగిరిగుట్టలో బీఆర్ఎస్​కు పడిన ఓట్లు కేవలం 28.1 శాతం మాత్రమే! రోడ్ల పేరిట ఇండ్లు కూల్చి, స్థానికులను ఇబ్బందుల పాల్జేయడం, గుట్టపైకి బస్సులు పెట్టి ఆటో డ్రైవర్ల పొట్టకొట్టడం లాంటి అంశాలు ఇందుకు కారణమని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ సిట్టింగులు గొంగిడి సునీత, ఫైళ్ల శేఖర్​రెడ్డి ఇద్దరూ ఓడిపోగా, రెండుచోట్లా కాంగ్రెస్​ అభ్యర్థులు గెలుపొందారు.

బీఆర్ఎస్​ను ఆదరించని వాసాలమర్రి

ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేండ్ల కింద  దత్తత తీసుకున్నారు. ఊరంతా పునర్నిర్మిస్తామని, పాత ఇండ్లు, ఆఫీసులు, బడి, గుడి స్థానంలో కొత్తవి కట్టిస్తామని, యువతకు ఉపాధి చూపుతామని హామీ ఇచ్చారు. దళిత
కుటుంబాలన్నింటికీ దళితబంధు కూడా​ప్రకటించారు. ఈ లెక్కన ఏ ఎన్నిక జరిగినా ఆ గ్రామంలో బీఆర్​ఎస్​కు వంద శాతం ఓట్లు రావాల్సిందే. కానీ, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 41.73 శాతం గ్రామస్తులే బీఆర్​ఎస్​కు ఓటేశారు.  వాసాలమర్రిని కేసీఆర్ ​దత్తత తీసుకోగానే అధికారుల హడావిడి చూసి ఏడాది తిరిగే సరికి ఊరు దశ మారుతుందని అంతా ఆశించారు. కానీ, కేసీఆర్​ ఫాంహౌస్​కు వెళ్లే రోడ్డు తప్ప ఊరిలో ఇసుమంత మార్పు కూడా రాలేదు.  ఈ మధ్యనే హెల్త్ సెంటర్, అంగన్​వాడీ సెంటర్లు, హైస్కూల్​ బిల్డింగ్​ల పని మొదలు పెట్టారు. ఏ ఒక్కరికీ ఇల్లు కట్టివ్వలేదు. ఇతరత్రా డెవలప్​మెంట్​ ఏమీ జరగలేదు. దీంతో ఈ నెల 30న జరిగిన ఎన్నికల్లో బీఆర్​ఎస్​పై వ్యతిరేకత వెలిబుచ్చారు.  గ్రామంలో1376 ఓట్లకుగాను 1258 పోలయ్యాయి. వీటిలో బీఆర్​ఎస్​ కు 525 మంది (41.73 శాతం) ఓటేయగా, కాంగ్రెస్​ అభ్యర్థి బీర్ల అయిలయ్యకు 448 మంది (35.61 శాతం), బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్​కు 219 (17.40 శాతం)మంది  ఓటేశారు.

యాదగిరిగుట్టలో 28.1 శాతమే

సీఎం కేసీఆర్​.. రూ. 1200 కోట్లతో యాదగిరిగుట్ట టెంపుల్​ను పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. టెంపుల్​ నిర్మాణంతో యాదాద్రి మరో తిరుమల అవుతుందని, స్థానికుల దశ తిరుగుతుందని ఎన్నో ఆశలు కల్పించినా ఉత్తదే అయ్యింది.  గుట్ట టౌన్​లో రోడ్ల విస్తరణ పేరుతో స్థానికులు తీవ్రంగా నష్టపోయారు. పరిహారం కోసం కొట్లాడినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. గుట్టపైకి వెళ్లే ఆటోలను నిషేధించడం వల్ల అనేకమంది డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. ఈ కోపంతో గుట్ట మున్సిపాలిటీలోని ఓటర్లు బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. గుట్టలో 13,465 ఓటర్లు ఉండగా, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11,222 మంది ఓటేశారు.  కేవలం 3012 (26.84 శాతం)  ఓట్లు మాత్రమే బీఆర్ఎస్​కు పడగా, కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్యకు 7394 (65.88 శాతం) ఓట్లు,  బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ కు 524 (4.66 శాతం) ఓట్లు పోలయ్యాయి.

వాసాల మర్రి
లైన ఓట్లు    బీఆర్ఎస్    కాంగ్రెస్    బీజేపీ
1258    525    448    219
యాదాద్రి
పోలైన ఓట్లు    బీఆర్ఎస్    కాంగ్రెస్    బీజేపీ
11,222    3,012    7,394    524