చెరువుకు గండి కొట్టి 5 నెలలైనా ప్రభుత్వంలో చలనం లేదు : జీవన్ రెడ్డి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ లో గత వానాకాలంలో భారీ వరదల  సమయంలో గండి కొట్టిన  రిజర్వాయర్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చొప్పదండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి  మేడిపల్లి సత్యం పరిశీలించారు. ఈ క్రమంలో చెరువు గండి పూడ్చకపోవడంతో యాసంగి సాగుకు ఎదురయ్యే కష్టాలు, రిజర్వాయర్ వల్ల ముంపు ఇబ్బందుల గురించి జీవన్ రెడ్డికి స్థానికులు వివరించారు. ప్రజల సమస్య లు పరిష్కరించడంలో ప్రభుత్వం దృష్టి సారించడం లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. చెరువుకు గండి కొట్టి 5 నెలలైనా మరమ్మతులు చేయడంపై ప్రభుత్వంలో చలనం లేదన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ ప్రభావిత ప్రాంతాలను ముంపు గ్రామాలుగా ప్రకటించాలన్న జీవన్ రెడ్డి... 5 నెలలు గడుస్తున్నా.. ఇంజినీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. 

 నారాయణ పూర్ రిజర్వాయర్ ముంపు గ్రామస్థుల భవిషత్తుకు భరోసా కల్పించాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మత్తడి ఎక్కువ ఎత్తు పెంచితే ఆ ప్రభావం కట్టపై పడుతుందని చెప్పారు. ప్రజలకు పునరావాస ప్యాకేజీ ప్రకటించాలన్న ఆయన... మరోసారి  ఇదే పరిస్థితి పురావృమైతే ప్రజల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.

ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోపణలు

ఎమ్మెల్యే రవిశంకర్ తమ గ్రామాన్ని దత్తత తీసుకుంటామన్నారని ప్రజలు ఆరోపించారు. ఎమ్మెల్యే పుట్టిన ఊరు ఇదని, కానీ ఒక్కసారైనా ఊరికి రాలేదని చెప్పారు. తమ బతుకులతో ఆడుకుంటున్నారన్న జనం... తమకు స్థలాలు చూపిస్తా అని ఇవ్వలేదని ఇస్తరుపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు కూలిపోయినా ఎవరూ రాలేదని, ఇప్పటివరకు చూడలేదని ఆరోపించారు. చుట్టూ నీళ్లతో నెల రోజులు ఇబ్బందిపడ్డామి వాపోయారు. తమ బాధ పట్టించుకునే వాళ్ళు లేరని, తమ బాధలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి విన్నవించుకున్నామని చెప్పారు.