- పెద్దపల్లి జిల్లాలో 8,298 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు
- గతేడాది డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం
- ఇప్పటికీ పూర్తి కాని వెరిఫికేషన్
- అసహనం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలో పోడు రైతుల ఆందోళనలతో వారికి పట్టాలివ్వాలని భావించిన ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో అప్లికేషన్లు స్వీకరించింది. నెల రోజుల్లో పరిశీలన పూర్తి చేసి పట్టాలిస్తమని చెప్పింది. అయితే అప్లికేషన్లు తీసుకొని 8 నెలలు పూర్తయినా ఇప్పటిదాకా వాటి వెరిఫికేషన్‌కూడా కాలేదు. దీంతో పట్టాల కోసం ఎదురు చూస్తున్న రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ ఏరియాలో పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న గిరిజనులు, ఇతరులు దశాబ్దాలుగా తమకు అటవీ భూముల చట్టం(ఆర్ఓఎఫ్ఆర్) ద్వారా పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం ఏ జిల్లాలో ఎంత పోడు భూమి ఉందో గుర్తించాలని రెవెన్యూ, అటవీ శాఖలను ఆదేశించింది. ఇప్పటికే తమకు పట్టాలు జారీ చేస్తే రైతుబంధు, రైతుబీమా, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాలు వర్తించేవని పోడు రైతులు ఆవేదన చెందుతున్నారు.
వెరిఫికేషన్లు ఆగినయి..
పెద్దపల్లి జిల్లాలో 8,298 ఎకరాల పోడు భూములు సాగులో ఉండగా వాటిలో గిరిజనులు 985, ఇతరులు 7,333 ఎకరాలు సాగు చేస్తున్నారు. పట్టాల కోసం వచ్చిన మొత్తం అప్లికేషన్లు 4,614. గిరిజనులు 482, ఇతరులు 4,132. జిల్లాలో దాదాపు 75 వేల ఎకరాల ఫారెస్ట్ భూములున్నాయి. అందులో 11 మండలాలకు చెందిన 54 గ్రామాల్లో 5,074 ఎకరాల భూములు ఆక్రమణకు గురైనట్లు అటవి శాఖ అధికారులు గుర్తించారు. జిల్లాలోని పెద్దపల్లి, మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, పాలకుర్తి, అంతర్గాం, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని 54 గ్రామాల నుంచి అప్లికేషన్లు వచ్చాయి. అటవీ శాఖ నిబంధనల(2005) ప్రకారం ఫారెస్ట్ భూములను పోడుగా మార్చుకొని సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద పట్టాలు ఇవ్వాలి. అలాగే గిరిజనేతరులైతే 75 ఏళ్ల నుంచి అటవీ భూములను సాగుచేసుకుంటూ బతుకుతున్నట్లయితే వారిని కూడా అర్హులుగా గుర్తించి పట్టాలివ్వాలి. ఈ క్రమంలో అప్లికేషన్ల వెరిఫికేషన్కష్టతరమైంది.
సర్వే కోసం కమిటీ..
పోడు భూముల సర్వే కోసం ప్రభుత్వం కలెక్టర్ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ ఫారెస్ట్, రెవెన్యూ అధికారుల కో ఆర్డినేషన్‌తో సర్వే నిర్వహించింది. వచ్చిన అప్లికేషన్లకు చెందిన భూమి చదునుగా ఉందా లేదా అనేది పరిశీలించాలి. గ్రాస్ రూట్లో చేయాల్సిన సర్వే కావడంతో అధికారుల నడుమ సమన్వయం కుదరడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. భూమి సాగు చేస్తున్న వారు.. సాగు మొదలు పెట్టినప్పుడు వారి ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుంటారు. అనంతరం అర్హుల జాబితాను సిద్ధం చేసి హక్కు పత్రాలు ఇవ్వవచ్చో లేదోనని ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. కానీ ఇందులో ఏ ప్రక్రియ కూడా ఇప్పటిదాకా పూర్తి కాలేదని తెలుస్తోంది. అయితే పోడు భూముల పరిశీలనకు సంబంధించిన గైడ్‌లైన్స్ ప్రభుత్వం అధికారులకు విడుదల చేయలేదని సమాచారం. ఆయా గైడ్‌లైన్స్ వస్తేనే పోడు భూములకు పట్టాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఫారెస్ట్ భూములు సాగుచేసుకుంటున్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. దీంతో గ్రాస్ రూట్లో ఉన్న పోడురైతుల నుంచి ఆందోళనలు తప్పదనే ఉద్దేశంతో ప్రక్రియను అధికారులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ నుంచి ఆదేశాలు రావాలి
పోడు భూముల పట్టాల ప్రక్రియ దాదాపు పూర్తియినట్లే. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం అప్లికేషన్ల వెరిఫికేషన్చేశాం. ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రాగేనే వాటి ప్రకారం పోడు భూముల పట్టాల ప్రక్రియ సాగుతుంది.
- లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్, పెద్దపల్లి