
హైదరాబాద్, వెలుగు: గురుకుల ఎంట్రన్స్ లో ఉత్తీర్ణుడై.. తల్లికి జ్వరం రావడంతో టైంకు స్కూల్లో రిపోర్ట్చేయలేకపోయిన ఓ స్టూడెంట్కు ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి తిరిగి సీటు ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గం కొత్తకోటకు చెందిన అశ్వినీ రాజుకు గురుకుల ఎంట్రన్స్ లో హయత్ నగర్ లోని ఎస్సీ గురుకుల స్కూల్ లో 5వ తరగతి సీటు వచ్చింది. అయితే, స్కూల్ లో రిపోర్ట్ చేసే గడువు శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
అశ్విని రాజు సాయంత్రం 6 గంటలకు స్కూల్ కు చేరుకోవటంతో గడువు ముగిసిందని జాయిన్ చేసుకునేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించారు. దీంతో తన బంధువులను తీసుకొని మాసబ్ ట్యాంక్ లోని డీసీసీ భవన్ లో ఎస్సీ గురుకుల సొసైటీ హెడ్ ఆఫీస్ కు రాత్రి 8 గంటలకు చేరుకున్నాడు. ఆ టైమ్ లో ఆఫీస్ లో ఉన్న ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణిని కలిసి తన ఆలస్యానికి గల కారణాన్ని నివరించాడు.
‘‘ “మా అమ్మకు జెరమొచ్చి హాస్పిటల్ లో ఉంది మేడమ్. అందుకే ఇన్ టైమ్ లో రాలేకపోయిన. ప్రిన్సిపాల్ గడువు ముగిసింది.. సీటు ఇవ్వనంటున్నరు. మీరే న్యాయం చేయండి”అని సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాడు. అయితే, టైమ్ ముగిసినప్పటికీ సెక్రటరీ అలుగు వర్షిణి.. తన విచక్షణాధికారాలతో ఉన్నతాధికారులతో మాట్లాడి అశ్విని రాజుకు తిరిగి సీటు ఇప్పించారు.