ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్లు కట్టట్లే .. వెజ్‍ అండ్‍ నాన్‍వెజ్‍ అమ్మట్లే..

ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్లు కట్టట్లే .. వెజ్‍ అండ్‍ నాన్‍వెజ్‍ అమ్మట్లే..
  • మూడున్నరేండ్లు కావొస్తున్నా పిల్లర్ల దశలోనే నిర్మాణాలు
  • గ్రేటర్‍ వరంగల్‍ సిటీ, మున్సిపాలిటీల్లో ఇదే దుస్థితి
  • గ్రేటర్‍ కార్పొరేషన్‍ ఎన్నికలప్పుడు శంకుస్థాపన చేసిన కేటీఆర్ 
  • మున్సిపాలిటీలో కొబ్బరికాయలు కొట్టిన మంత్రి హరీశ్​రావు
  • విడ్డూరంగా.. నిర్మాణం పూర్తవ్వని మార్కెట్లను ప్రారంభించిన్రు

వరంగల్‍/వర్ధన్నపేట, వెలుగు: గ్రేటర్‍ వరంగల్లో దాదాపు మూడున్నరేండ్ల కింద శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్‍ వెజ్ అండ్ నాన్‍వెజ్‍ మార్కెట్లు పిల్లర్ల స్టేజీ దాటడం లేదు. అప్పట్లో గ్రేటర్‍ ఎలక్షన్లు ఉండడంతో బీఆర్‍ఎస్‍ సర్కారు ఇంటిగ్రేటేడ్‍ మార్కెట్ల పేరుతో సిటీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఒకేచోట వెజ్‍, నాన్‍వెజ్ దొరికేలా మార్కెట్లు ఉంటాయన్నారు. అప్పటి సీఎం కేసీఆర్‍ బ్యాక్టీరియా స్టోరీ చెప్పగా.. మున్సిపల్‍ మంత్రి కేటీఆర్‍ సిటీలో, మరో మంత్రి హరీశ్ రావు మున్సిపాలిటీల్లో మార్కెట్‍ పనులకు శంకుస్థాపనలతో హడావుడి చేశారు.

ఐదారు నెలల్లో అత్యాధునిక వెజ్‍, నాన్‍వెజ్‍ మార్కెట్లను జనాలు చూస్తారని చెప్పి ఉన్న మార్కెట్లను కూల్చివేశారు. తీరాచూస్తే.. దాదాపు మూడున్నరేండ్లు దగ్గరకొచ్చినా కనీసం ఒక్కటంటే ఒక్క మార్కెట్‍ కూడా చేతికిరాలేదు. పలుచోట్ల పనులు ఆగడంతో నిర్మాణాలు ఎండావానలకు దెబ్బతింటున్నాయి. వరంగల్లో లక్ష్మిపురం ఫ్రూట్‍మార్కెట్, హనుమకొండ రాంనగర్‍లోని పాత ఇరిగేషన్‍ డిపార్టుమెంట్‍ ఆఫీస్‍ (ఐబీ గెస్ట్ హౌజ్‍), కాజీపేట ఓల్డ్​మార్కెట్‍, కరీంనగర్‍ రోడ్డులోని చింతగట్టు కెనాల్‍వద్ద, రంగశాయిపేటలో మరొకటి మొత్తంగా ఐదు ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.

ఐదు మార్కెట్లలో ఒక్కటి పూర్తిచేయలే

 గ్రేటర్ వరంగల్‍ కార్పొరేషన్‍ ఎన్నికల నేపథ్యంలో నాటి మంత్రులు, గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు నానా హడావుడి చేశారు. ట్రైసిటీ పరిధిలో మొత్తంగా 05 ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్లు నిర్మించనున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో గ్రేటర్ మున్సిపల్‍ ఎన్నికల నోటిఫికేషన్‍ వస్తుందనగా.. 2021 ఏప్రిల్‍ 12న కేటీఆర్‍ వరంగల్‍ సిటీలో పర్యటించారు. వరంగల్‍ లక్ష్మిపురం ఫ్రూట్‍మార్కెట్, హనుమకొండ రాంనగర్‍లోని పాత ఇరిగేషన్‍ డిపార్టుమెంట్‍ ఆఫీస్‍ (ఐబీ గెస్ట్ హౌజ్‍), రంగశాయిపేటలో మార్కెట్ల నిర్మాణానికి శిలాఫలకాలు వేశారు.

లక్ష్మిపురం మార్కెట్‍కోసం రూ.24 కోట్లు, ఐబీ గెస్ట్ హౌజ్‍ మార్కెట్‍కోసం రూ.4.50 కోట్లు కేటాయించామన్నారు. ఐదారు నెలల్లోనే మార్కెట్లు జనాలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తీరాచూస్తే.. కేటీఆర్‍ చెప్పిన 05 మార్కెట్లలో మూడుచోట్ల పిల్లర్లు, స్లాబ్‍ల దశ వరకే పనులు ఆగిపోగా.. మరో రెండు కాజీపేట ఓల్డ్​మార్కెట్‍, కరీంనగర్‍ రోడ్డులోని చింతగట్టు కెనాల్‍వద్ద కనీసం పనులే మొదలుకాలేదు. 

వర్ధన్నపేట, పరకాల మున్సిపాలిటీల్లోనూ..

గ్రేటర్‍ సిటీతో పాటు మున్సిపాలిటీల్లోనూ ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్‍ నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. వరంగల్‍జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో 2022 మే 10న ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్‍ నిర్మాణ పనులకు అప్పటి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. రూ.2 కోట్లతో చేపడుతున్న మార్కెట్‍ పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పినా పిల్లర్ల దశ దాటలేదు. కానీ చూడడానికే విడ్డూరంగా.. పూర్తికాని మార్కెట్‍ను మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లకు కొన్ని రోజులముందు శిలాఫలకాలు వేసి ప్రారంభించారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో 2021 డిసెంబర్‍ 22న ఈ పనులను ప్రారంభించారు. రూ.4.5 కోట్లతో పనులు మొదలుపెట్టినా డిజైన్‍ మార్పు, ఫండ్స్ పెండింగ్‍ కారణంతో నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. 

అసెంబ్లీలో కేసీఆర్‍ చెప్పిన ‘బ్యాక్టీరియా’ స్టోరీ ఇదే..  

ఇంటిగ్రేటేడ్‍ మార్కెట్లకు శంకుస్థాపన నేపథ్యంలో అప్పటి సీఎం కేసీఆర్‍ అసెంబ్లీ వేదికగా బ్యాక్టీరియా స్టోరీ చెప్పారు. ‘‘దేశం, రాష్ట్రంలోని మార్కెట్లలో గతంలో మోరీల పక్కన అమ్మకాలు జరిగేవి. దీనివల్ల బ్యాక్టీరియా వ్యాపించే ఆస్కారం ఉండడంతో.. పూర్వం ఎవరైనా ఇండ్లకు వస్తే చెప్పులు బయటే విప్పి కాళ్లు కడిగిన తర్వాతే లోపలకు వచ్చేటోళ్లు. మామూలుగా బ్యాక్టీరియా రెండున్నర అడుగులకంటే ఎక్కువ ఎత్తులోపే ఉంటది. దానికి దూరంగా ఉండేందుకే డైనింగ్‍ టేబుల్‍ కాన్సెప్ట్​ వచ్చింది.

తాము సైతం ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్లలో రెండున్నర అడుగులపైనే విక్రయాలు ఉండేలా దిమ్మెలు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలోని ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్లు చూసి వేరే రాష్ట్రాలోళ్లు ఆశ్చర్యపోతున్నరు. రాష్ట్రంలో ప్రతీ మున్సిపాలిటీలో ప్రతి 02 లక్షల మంది జనాభాకు ఒకటి చొప్పున వెజ్‍, నాన్‍వెజ్ ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్లను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువస్తాం” అంటూ మాట్లాడారు.