రా ష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి కుటుంబాల సంక్షేమం కోసం గతంలో ఉన్న ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ (ఎఫ్.బీ.ఎఫ్) స్కీంను రద్దుచేసి దాని స్థానంలో సామూహిక బీమా పథకం జీఐఎస్ (గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం) ప్రవేశపెట్టారు. ఈ పథకం నవంబర్ 1984 నుంచి అమలులోకి వచ్చింది. ఇది డబుల్ బెనిఫిట్ స్కీమ్. సర్వీసులో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు దురదృష్టవశాత్తు మరణిస్తే అప్పటివరకు సేవింగ్స్ ఖాతాలో ఉన్న నిల్వపై వడ్డీతో పాటు ఇన్సూరెన్స్ మొత్తాన్ని నామినీలకు చెల్లిస్తారు.
ఒకవేళ ఉద్యోగి రిటైర్ అయితే సేవింగ్స్ ఖాతాలో ఉన్న నిల్వ, వడ్డీ కూడా లెక్కించి చెల్లిస్తారు. ఇందుకోసం వేతన స్కేలు గరిష్ట పరిమితి ప్రాతిపదికగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా విభజించి జీఐఎస్ స్లాబ్లను నిర్ధారించారు. అక్టోబర్ 1994 వరకు చందా రేట్లు యూనిట్ పది రూపాయలు ఉండగా, అదే ఏడాది నవంబర్ లో పదిహేను రూపాయలకు పెంచారు.
ప్రతి యూనిట్ 15 రూపాయల నుంచి రూ.4.50 ఇన్సూరెన్స్ అకౌంట్కు, మిగతా రూ.10.50 సేవింగ్స్ అకౌంట్కు జమ చేస్తారు. 1994 నవంబర్ నుంచి ఏ– గ్రూప్ జీఐఎస్ చందా నెలకు రూ.120 కాగా, బీ– గ్రూప్ చందా నెలకు రూ.60, సీ–గ్రూప్ ఉద్యోగులకు రూ.30, డీ– గ్రూప్ చందాను రూ.15 గా నిర్ధారించారు. సర్వీసులో ఉండగా మరణిస్తే ఏ– గ్రూప్ వారి కుటుంబాలకు రూ.లక్షా ఇరవై వేలు, బీ– గ్రూప్ వారికి అరవై వేలు, సీ– గ్రూప్ వారికి ముప్పై వేలు, డీ– గ్రూప్ వారికి పదిహేను వేలు ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నారు.
నామమాత్రంగా ఆర్థిక ధీమా
30 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ నేటికీ జీఐఎస్ స్లాబ్లను మార్చకపోవడం శోచనీయం. 1994 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు పీఆర్సీలను అమలు చేసినప్పటికీ జీఐఎస్ స్లాబ్రేట్లను పెంచలేదు. వేతనాలు పెరిగిన దామాషాలో కాకపోయినా కనీస మొత్తంలో కూడా.. జీఐఎస్ స్లాబ్లను పెంచకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముఖ్యంగా సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు చాలా అన్యాయం జరుగుతున్నది.
1994లో రూ.30 ఉన్న జీఐఎస్ చందా ఇప్పుడు కూడా అంతే ఉంది. అదేవిధంగా 1994లో 60 రూపాయలు ఉన్న స్కూల్ అసిస్టెంట్లు చందా 30 ఏండ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం విచారకరం. దీంతో సామూహిక బీమా పథకం (జీఐఎస్) నామమాత్రంగా మారిపోయి ఉద్యోగులకు ఆర్థిక ధీమా కల్పించడం లేదు. పక్క రాష్ట్రాలలో జీఐఎస్ స్లాబ్ రేట్లను ఎప్పటికప్పుడు సవరించి ఉత్తర్వులు విడుదల చేస్తున్నారు. దీనివల్ల అక్కడి ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ స్కీమ్ వల్ల గరిష్ట ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మూడు దశాబ్దాల నాటి స్లాబ్ రేట్లు
కేరళలో జీఐఎస్ స్లాబ్ లను రూ.600, రూ.500, రూ.400, రూ.300 గా నిర్ణయించి 2016 నుంచి అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో 2010 నుంచి రూ.960, రూ.480, రూ.240, రూ.60 స్లాబ్ రేట్లను అమలుకు తెచ్చారు. కర్ణాటకలో రూ.480, రూ.360, రూ.240, రూ.120 అమలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు దశాబ్దాల క్రితం నిర్ధారించిన స్లాబ్ రేట్లనే ఇంకా కొనసాగిస్తున్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ కమిటీకి సమర్పించే ప్రతిపాదనల్లో మెరుగైన జీఐఎస్ స్లాబ్లను సిఫారసు చేసినప్పటికీ నేటికి వాటిని సవరించకపోవడం దారుణం. మరికొద్ది రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం రెండవ పిఆర్సీ ని ప్రకటించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రోపాధ్యయ సంఘం స్లాబ్ రేట్లను రూ.500, రూ.800, రూ.1200, రూ.1500కు పెంచాలని ప్రతిపాదనలు సమర్పించింది.
ప్రతిపాదనలు పరిశీలించి జీఐఎస్ స్లాబ్ రేట్లను పొరుగు రాష్ట్రాల కన్నా మెరుగ్గా నిర్ధారించాలి. చందా మొత్తం ఉద్యోగ, ఉపాధ్యాయులే చెల్లిస్తారు ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించాలి. త్వరలో ప్రభుత్వం ప్రకటించే నూత న పీఆర్సీలో జీఐఎస్ స్లాబ్ రేట్లలో మార్పు ఉంటుందని ఆశిద్దాం.
- సుధాకర్. ఏ.వీ, అదనపు ప్రధాన కార్యదర్శి, టీచర్స్ యూనియన్, తెలంగాణ