- రేషన్ బియ్యం కోసం కొత్త వడ్లు చూపుతున్రు..
- పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వ వడ్లతో లాభాలు..
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
వనపర్తి, వెలుగు: కొత్త వడ్లు వస్తున్నా.. ప్రభుత్వానికి మిల్లర్లు సీఎంఆర్ అప్పగించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు 40 శాతం వడ్లను మాత్రమే బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకా 60 శాతం పక్కదారి పట్టాయన్న ఆరోపణలున్నాయి. మిల్లర్లు సదరు వడ్లను బయటి మార్కెట్ లో ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని తెలుస్తోంది. మిల్లుల్లో రోజు రోజుకు వడ్ల నిల్వలు తగ్గుతున్నా.. సివిల్ సప్లై, విజిలెన్స్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో మిల్లర్లు యథేచ్ఛగా దందా చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
98 వేల మెట్రిక్‌టన్నుల బియ్యం ఇవ్వలే..
వనపర్తి జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్లు గత ఏడాది యాసంగిలో 87 రైస్ మిల్లులకు 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు అందజేశారు. వీరిలో ఏ ఒక్క మిల్లర్ కూడా బియ్యం సకాలంలో ఇవ్వలేదు. ఇప్పటికీ 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తిరిగి ఇచ్చారు. ఇంకా 98 వేల మెట్రిక్‌టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఇటీవల ఆరోపణలు రావటంతో విజిలెన్స్ఆఫీసర్లు అన్ని మిల్లుల్లోని స్టాక్ చెక్ చేశారు. తనిఖీల్లో వడ్ల నిల్వలు మాయమైనట్లు గుర్తించారు. అధికారుల తీరుపై ఆరోపణలు రావడంతో ఇక్కడి డీఎస్వో ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అయినా మిల్లర్ల ఆగడాలు ఏ మాత్రం తగ్గలేదు. జిల్లాకు చెందిన ఓ ముఖ్య అధికారి అండదండలతో రైస్ మిల్లర్లు మరింత రెచ్చిపోయి పాత బియ్యం మొత్తం అమ్మేశారు. తాజాగా జిల్లాలో వరికోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో 12 శాతం తేమ ఉన్న వడ్లనే కొనాల్సి ఉన్నా.. కొందరు మిల్లర్లు తమ మిల్లులలోని స్టాక్ స్థానంలో కొత్త వడ్లు కొనుగోలు చేసి భర్తీ చేసుకుంటున్నారు. తేమ శాతం చూడకుండా పచ్చి వడ్లు కొనడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వడ్లను నేరుగా మిల్లుల్లో స్టాక్ చేసి బియ్యం చేస్తే నాణ్యత దెబ్బతింటుందని, బియ్యం కూడా రంగు మారి రేషన్ షాపులకు వస్తాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ దందాను కట్టడి చేస్తలే..
జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ దందాపై జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరని విమర్శలు వస్తున్నాయి. రేషన్ బియ్యం పంపిణీని పటిష్టం చేసిన అధికారులు ఆ తర్వాత బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఈ సీజన్ సీఎంఆర్ కోసం 110 రైస్ మిల్లులను ఎంపిక చేశారు. వీటితో పాటు 10 బాయిల్డ్ రైస్ మిల్లులకు కూడా పర్మిషన్ ఇచ్చారు. 3.6 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నారు. అయితే కొత్త వడ్లను మిల్లర్లు బయటి మార్కెట్ లో అమ్ముకుంటూ వీటి స్థానంలో అక్రమంగా కిలో రూ.12 చొప్పున రేషన్‌బియ్యం కొని తిరిగి ప్రభుత్వానికి రీ సైక్లింగ్ చేసి ఇస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జిల్లాలో వెలుగు చూసిన ట్రక్షీట్ల దందాపై కూడా అధికారులు ఫోకస్చేయాలని పలువురు రైతులు డిమాండ్చేస్తున్నారు.
మిల్లులపై గట్టి నిఘా
జిల్లాలో సీఎం ఆర్ రైస్ మిల్లులపై ఈ సారి గట్టి నిఘా పెట్టాం. ఇటీవల మిల్లర్ల తో మీటింగ్పెట్టిన కలెక్టర్ ఎలాంటి అక్రమాలు జరిగినా క్రిమినల్ కేసులు పెడ్తమని హెచ్చరించారు. గతేడాది మిగిలిపోయిన 60 శాతం సీఎంఆర్ బియ్యాన్ని నెల రోజుల్లో ఇవ్వాలని మిల్లర్లకు సూచించాం. నాణ్యమైన బియ్యాన్ని తీసుకుని, బాగా లేకుంటే రిజెక్ట్ చేస్తాం.– కొండల్ రావు, డీఎం, సివిల్సప్లై శాఖ