కలెక్టర్​పై దాడి వెనుక కేసీఆర్​ ఉన్నా వదలం..: డిప్యూటీ సీఎం భట్టి

కలెక్టర్​పై దాడి వెనుక కేసీఆర్​ ఉన్నా వదలం..: డిప్యూటీ సీఎం భట్టి
  • కాల్​ డేటాలో అసలు గుట్టు బయటకు వస్తున్నది
  • ఎంతటి వారున్నా సహించేది లేదు
  • కేసీఆర్​, కేటీఆర్, హరీశ్​ తలకిందులుగా తపస్సు చేసినా ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు
  • ఫార్ములా రేస్​ కేసు విచారణ నుంచి తప్పించుకోడానికి బీజేపీతో కేటీఆర్​ ఒప్పందమని ఆరోపణ

హైదరాబాద్​, వెలుగు: లగచర్లలో కలెక్టర్​పై దాడి చేసింది.. చేయించిందీ బీఆర్​ఎస్​ వాళ్లేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ముందస్తుగా కుట్ర పన్ని దాడి చేశారని మండిపడ్డారు. దీని వెనుక కేసీఆర్​, కేటీఆర్​ ఉన్నా  వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఫార్ములా ఈ –రేస్​ కేసు నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్​ ఢిల్లీకి పోయొచ్చారని అన్నారు. ఫార్ములా ఈ–రేస్​ కేసులో ఒకవేళ గవర్నర్ తిరస్కరిస్తే చట్టం ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. 

బుధవారం సెక్రటేరియెట్​లో మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు తలకిందులుగా తపస్సు చేసిన ప్రజాప్రభుత్వాన్ని అస్తిరపరచలేరని అన్నారు. ‘‘ఫార్ములా ఈ– రేస్ కేసు తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీకి పోయి బీజేపీ పెద్దలతో ఒప్పందం చేసుకున్నడు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్​కు  ఓటు వేయొద్దని కేటీఆర్​ మట్లాడుతున్నడు. గవర్నర్​పై మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. కేసు విచారణకు సహకరిస్తారని ఆశిస్తున్నం” అని తెలిపారు. 

కాల్​ డేటాలో అసలు విషయం బయటకు

బీఆర్ఎస్ కుట్రపూరితంగా ముందస్తు ప్రణాళిక ప్రకారంగా అరాచక శక్తులతో రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించిందని భట్టి అన్నారు. లగచర్లలో కలెక్టర్ దాడి వెనుక కాల్ డేటా తీయగా బీర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు  తెలిసిందన్నారు. దీనివెనక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించబోమని, చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం, అధికారులతో చర్చించడం, న్యాయస్థానాలకు వెళ్లడం వంటి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

‘‘బీఆర్ఎస్  అధికారంలో ఉన్నప్పుడు మల్లన్నసాగర్  కోసం భూసేకరణ చేసిన సమయంలో ప్రజాస్వామ్యయుతంగా మేం ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన గొంతెత్తాం.. అధికారులను కలిశాం.. న్యాయస్థానానికి వెళ్లాం.. నిరసనలు చేశామే తప్ప ఇలా దాడులకు తెగబడలేదు. కలెక్టర్​పై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేద్దామని అనుకుంటే పొరపాటు” అని ఆయన హెచ్చరించారు. ‘‘పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్​ను అడుగుతున్న..! ఇలా దాడులు చేయించడం కరెక్టేనా? బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి మాట్లాడాలి” అని నిలదీశారు. అధికారులకు  ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా అమాయకులైన యువతను బీఆర్​ఎస్​ నేతలు రెచ్చగొట్టి  ప్రాణాలు కోల్పోయేలా చేశారని,  ఇప్పుడు అధికారం పోయేసరికి మళ్లీ అదే విధంగా అమాయక దళిత గిరిజ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.