తగ్గదేలే.. మంత్రి కేటీఆర్​ బుజ్జగించినా వినలే

తగ్గదేలే..  మంత్రి  కేటీఆర్​ బుజ్జగించినా వినలే
  • అనుచరులతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి సమావేశం
  • పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని ప్రకటన


హైదరాబాద్/నాగర్ కర్నూల్, వెలుగు: కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ​దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్​పార్టీ, పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ఆయనను పిలిపించి బుజ్జగించారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని గెలిపిస్తే ఎన్నికల తర్వాత కేబినెట్​హోదా ఉన్న పదవి ఇస్తామని కేటీఆర్ ​హామీ ఇచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదని తెలిసింది. శుక్రవారం హైదరాబాద్​లోని తన నివాసంలో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో భేటీ అయిన కసిరెడ్డి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 

ఎమ్మెల్సీ వర్గమనే ముద్ర వేసి తమను వేధించి రాజకీయంగా అణచివేయడానికి ప్రయత్నించారని ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వాపోయారు. కసిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఆయన వర్గం తనపై వివక్ష చూపించారన్నారు. ఇంకో 40 ఏండ్లు ఎమ్మెల్సీగా ఉన్నా ఏమీ చేయలేనని అర్థమైందన్నారు. అందుకే తన కార్యకర్తల కోరిక మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు చెప్పారు. 

ALSO READ: కాంగ్రెస్ పాలిటిక్స్..హైదరాబాద్​ టు ఢిల్లీ వయా బెంగళూరు​

జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, కడ్తాల్, ఆమనగల్లు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కల్వకుర్తి మాజీ సర్పంచులు బృంగి ఆనంద్​ కుమార్, పసుల సుదర్శన్ రెడ్డి, సంజీవ్​యాదవ్,   కడ్తాల యాదగిరి రెడ్డి, భాస్కర్ రెడ్డి భేటీలో పాల్గొన్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి చిత్తరంజన్​దాస్​సైతం శుక్రవారమే బీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పారు. ఒకే రోజు కల్వకుర్తికి చెందిన ఇద్దరు కీలక నాయకులు బీఆర్ఎస్​ను వీడుతున్నట్టు ప్రకటించారు.