- తునికాకు కూలీలకు రూ.20 కోట్లు శాంక్షన్
- ఆఫీసర్ల నిర్లక్ష్యంతో 38,556 మందికి ఆగిన బోనస్
- చెక్కు చూపి చేతులేత్తేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్
- నాలుగున్నర నెలలుగా ఎదురుచూపులు
- ఇప్పటికైనా పట్టించుకోవాలని వేడుకోలు
కోల్‌బెల్ట్, వెలుగు: తునికాకు కూలీలకు ప్రభుత్వం నుంచి బోనస్ పైసలు శాంక్షన్ అయినప్పటికీ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో వారి చేతికి అందక వేలాది మంది ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు 38,556 మంది తునికాకు కూలీలుండగా సుమారు 900 మంది కల్లెదారులున్నారు. వీరికి 2016 నుంచి 2022 వరకు బోనస్‌గా సుమారు రూ.20 కోట్లు రావాల్సి ఉంది. తమ బోనస్ డబ్బుల కోసం వందలాది మంది కూలీలు ఫారెస్టు ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సంబంధిత ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు .
అధికారుల నిర్లక్ష్యంతోనే..
తునికాకు కూలీలు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కల్లెదారుల ద్వారా ఫారెస్ట్ ఆఫీసర్లకు అందించారు. కాని సిబ్బంది నిర్లక్ష్యంతో కంప్యూటర్లో అకౌంట్ నెంబర్లు నమోదు చేయడంలో తప్పులు దొర్లడంతో డబ్బులు జమకావడం లేదని తునికాకు కూలీలు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు అటవీశాఖ ఆఫీసుల చుట్టూ తిరిగిన ఆఫీసర్లు తమ గోడు వినడంలేదని వాపోతున్నారు. మార్చి 15న చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గ పరిధిలోని 38,556 మందికి సంబంధించిన రూ.18.11 కోట్ల బోనస్ చెక్కు లబ్ధిదారులకు అందించారు. అయితే ఇంతవరకు డబ్బులు తమ అకౌంట్లలో జమకాలేదని అంటున్నారు.
చెన్నూరుతో పాటు మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఇదే సమస్య ఉందని చెప్తున్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఒక్కో కూలీకి సుమారు రూ.3వేల నుంచి రూ.40వేల వరకు బోనస్ డబ్బులు మంజూరైనప్పటికీ అకౌంట్ వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్ సక్రమంగా లేకపోవడం వాటిని పొందలేకపోతున్నారని అటవీశాఖ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. వాటిని సవరించి సకాలంలో డబ్బులు ఇప్పించాల్సిన అటవీశాఖ ఆఫీసర్లు తమకు సంబంధంలేదని చేతులేత్తుస్తున్నారు. మరోవైపు తునికాకును కూలీల నుంచి సేకరించి రాష్ట్ర సర్కార్‌కు అందజేసిన కల్లెదారులు తమ పరిధిలోని వందలాది కూలీలకు లక్షల్లో బోనస్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. బోనస్ తమ ఖాతాలో జమ కాకపోవడంతో కూలీలు కల్లెదారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మంచిర్యాల అటవీ రేంజ్ పరిధిలో కూలీల అకౌంట్స్ వివరాల లిస్టును తాము హైదరాబాద్‌కు పంపించామని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. రిజెక్టు అయిన లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు సరిచేసి తిరిగి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
2016 నుంచి బోనస్ రాలే..
అటవీ సంపదపై వచ్చే ఆదాయం ఆ ప్రాంత ప్రజలకే చెందాలనే ఉద్దేశ్యంతో రాయల్టీ డబ్బులను కూలీలకు బోనస్ రూపంలో ప్రభుత్వమే చెల్లిస్తున్నది. సీజన్లో తునికాకు సేకరణకు ముందే బోనస్ అందిస్తుంది. అయితే 2016 నుంచి 2022 వరకు రాష్ట్ర సర్కార్ తునికాకు కూలీలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.233 కోట్లు బోనస్ డబ్బులు చెల్లించాల్సి ఉన్నది. జనవరిలో ఇదే విషయంపై రివ్యూ మీటింగ్ నిర్వహించిన అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తునికాకు సేకరించే కూలీల పేర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరణ పూర్తయిందని, డబ్బుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్నెళ్లు దాటినా ఇప్పటి వరకు కూలీలకు బోనస్ అందలేదు.
మా గోడు పట్టించుకుంటలేరు
తునికాకు ఏరినందుకు వచ్చే బోనస్ పైసలు బ్యాంకు ఖాతాలో పడలే. ఎనిమిది నెలల కింద ఫారేస్టోళ్లు బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నరు. రూ.15వేల బోనస్ రావాలె. మా గోడు ఎవరూ పట్టించుకుంటలేరు.
- వీరగొని కమల, తునికాకు కూలీ, వెంకటాపూర్
కూలీల ఒత్తిడితో ఇబ్బంది పడ్తున్నం..
కూలీల బోనస్ పైసల కోసం పనులు వదిలిపెట్టి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నం. కూలీల నుంచి సేకరించిన తునికాకును గోదాంలకు పంపించినం. వాళ్లకు నాలుగేండ్లుగా బోనస్ డబ్బులు ఖాతాలో జమ కాలే. మాపై ఒత్తిడి తీసుకొస్తున్నరు. కూలీలకు సంబంధించి రూ.30లక్షల వరకు బోనస్ రావాల్సి ఉన్నది. అప్పులు తీసుకొచ్చి చెల్లించలేని పరిస్థితి. ఆఫీసర్లు కూలీల బ్యాంక్ వివరాలను సక్రమంగా నమోదు చేసి వెంటనే బోనస్ డబ్బులు జమచేయాలె.
- గట్టు శ్రీనివాస్‌గౌడ్, కల్లెదారు, మందమర్రి మండలం