ఎక్కువ ఫీజు గుంజుతున్న ల్యాబ్ లు
ప్రజలకు రో్జుకు రూ.50 లక్షల నష్టం
హైదరాబాద్, వెలుగు: సర్కార్ నిర్లక్ష్యంతో జనాలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రోజూ కనీసం రూ.50 లక్షలు నష్టపోతున్నారు. కరోనా టెస్టుల ధరలను కేంద్రం తగ్గించినా రాష్ర్ట సర్కార్ పట్టించుకోవడం లేదు. గతంతో పోలిస్తే కరోనా టెస్టింగ్ కిట్ల ధరలు భారీగా తగ్గాయి. మార్చిలో రూ.2,500 ఉన్న ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్ ధర ఇప్పుడు రూ.250కి దిగివచ్చింది. మన రాష్ర్టంలో మాత్రం ఆర్టీపీసీఆర్ టెస్ట్‌కు రూ.2,500 నుంచి రూ.3 వేల వరకూ వసూలు చేస్తున్నారు. కిట్ ధర రూ.2,500 ఉన్నప్పుడు రూ.4,500కు మించి వసూలు చేయొద్దని ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ధరలు తగ్గడంలో రూ.950కి మించి చార్జ్ చేయొద్దని 3 వారాల క్రితం ఉత్తర్వులిచ్చింది. ఏపీ సహా, పలు రాష్ర్టాలు ధరలను నియంత్రిస్తూ ఉత్తర్వులిచ్చాయి.
ఏపీలో రూ.వెయ్యికి మించి వసూలు చేయొద్దని ఆదేశాలు ఉన్నాయి. మన రాష్ర్ట సర్కారు పట్టించుకోవడం తో దోపిడీ ఆగడం లేదు. ప్రస్తుతం ప్రైవేట్ ల్యాబుల్లో రోజుకు సగటున 2,500 మంది టెస్టులు చేయించుకుంటున్నారు. టెస్టుకు రూ. 3 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు జనం రూ.50 లక్షలు నష్టపోతున్నట్టు లెక్క. మన దగ్గర జూన్ 15 నుంచి ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా టెస్టులకు అనుమతించారు. టెస్ట్ ధరను రూ.2,200గా నిర్ణయించారు. ఇంటికెళ్లి శాంపిల్ తీసుకుంటే రూ.2,800 వసూలు చేసుకోవచ్చని జీవో చేశారు. ల్యాబ్‌లు మాత్రం ఎక్కువగా చార్జ్ చేస్తున్నాయి. యాంటీజెన్ టెస్టింగ్ కిట్ల ధరలూ తగ్గాయి. మొదట్లో రూ. ఐదొందలకు పైగా ఉన్న కిట్ ధర, ఇప్పుడు రూ.270 నుంచి 300 వరకు పలుకుతోంది. చాలా కంపెనీలు ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ కిట్లను తయారు చేస్తుండడంతో ధరలు తగ్గాయి.