పోడు భూములకు పట్టాలివ్వాలని కేంద్రం చెబుతున్నా రాష్ట్రం పట్టించుకోలే : ​ఎంపీ సోయం బాపురావ్​

ప్రభుత్వ విప్​ రేగా రెచ్చగొట్టడం వల్లే ఎఫ్ఆర్ఓ హత్య : ఎంపీ సోయం బాపురావ్​

భద్రాద్రికొత్తగూడెం/చండ్రుగొండ, వెలుగు: అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన పోడు సాగుదారులకు పట్టాలివ్వాలని ఏడేండ్లుగా కేంద్రం రాష్ట్రానికి లేఖలు రాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోయిందని తుడుందెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, ఆదిలాబాద్​ఎంపీ సోయం బాపురావ్​ పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. పోడు భూముల పట్టాల విషయంలో సీఎం కేసీఆర్​తో పాటు రాష్ట్ర మంత్రులు, టీఆర్​ఎస్​ లీడర్లు పూటకోమాట మాట్లాడుతూ ఆదివాసీలను మోసం చేస్తున్నారన్నారు. ఎఫ్ఆర్ఓ హత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై మర్డర్​ కేసు పెట్టాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఎఫ్ఆర్ఓ హత్య జరిగిందన్నారు. ఆదివాసీలకు అన్యాయం జరిగితే రేగా కాంతారావు వారిని కనీసం పరామర్శించకపోవడం దారుణమన్నారు. ఎర్రబోడు ప్రాంతంలోని ఆదివాసీలను ఫారెస్ట్​ అధికారులు చిత్ర హింసలకు గురిచేశారన్నారు. నీళ్లకోసం తవ్వుకున్న బావిలో మూత్రం పోశారని, చివరకు చెలిమ తీసుకుంటే అందులోనూ మూత్రం పోసి ఫారెస్ట్​ అధికారులు వేధించారన్నారు. ఎర్రబోడు ప్రాంతంలో గొత్తికోయ కుటుంబాలు 40 ఉన్నాయని, 120 ఎకరాల్లో 2002 నుంచి పోడు వ్యవసాయం చేస్తున్నారన్నారు. రాజ్యాంగం ప్రకారం గొత్తికోయలకు దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉందన్నారు. గొత్తికోయలను ఇక్కడి నుంచి వెళ్లగొట్టాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని, లేని పక్షంలో మార్చి చివరివారంలో కొత్తగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. 

దేశంలో ఆదివాసీలు ఎక్కడైనా జీవించవచ్చు

ఆదివాసీలు దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు, జీవించవచ్చని, వద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదని ఎంపీ సోయం బాపురావు అన్నారు. చండ్రుగొండ మండలంలోని ఎర్రబోడును ఆదివారం  ఎంపీ సందర్శించారు. ఎర్రబోడులో గొత్తికోయల జీవన శైలి, మౌలిక వసతులను అడిగి తెల్సుకున్నారు. గ్రామంలో రోడ్డు, తాగునీరు, కరెంట్, అంగన్ వాడీ, హెల్త్ సబ్ సెంటర్​సౌకర్యాలు కల్పించాలని డిమాండ్​చేశారు. ఎర్రబోడు  వలస ఆదివాసీ ల సమస్యల పై పార్లమెంట్ లో జీరో అవర్ లో మాట్లాడతానని, అవసరమైతే ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎర్రబోడులో 8వ తరగతి చదివి మానేసిన రవ్వా వెంకట్రావును విద్యావాలంటీరుగా చేయాలని సూచించారు. చిన్నారులకు చదువు చెప్పాలని, నెల జీతం తాను ఇస్తానని చెప్పారు. గ్రామంలోని 40 గొత్తి కోయ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, తొమ్మిది తెగల ఆదివాసీ సమన్వయకర్త రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు, ఆధార్ సొసైటీ కార్యదర్శి పాపయ్య, ఆదివాసీ మండల లీడర్లు పాల్గొన్నారు.