రూల్స్‌కు విరుద్ధంగా ఆర్డినరీ రెజల్యూషన్‌తో ఎక్స్టెన్షన్
కోల్మినిస్ట్రీ వ్యతిరేకించినా ఇంకా సీఎండీ పోస్టులోనే..
ఇప్పటికే ఆరేళ్లు పూర్తయినా మళ్లీ కొనసాగింపు
ఇది కేంద్రాన్ని ధిక్కరించడమే అంటున్న ఎక్స్పర్ట్స్
వెలుగు, నెట్వర్క్: సింగరేణి సీఎండీగా ఎన్. శ్రీధర్‌ను కంటిన్యూ చేసేందుకు కేంద్రం నో చెప్పినా ఆయన మాత్రం తన కుర్చీ దిగట్లేదు. ఇటీవల కొత్తగూడెంలోని కంపెనీ హెడ్డాఫీస్లో జరిగిన యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ లో శ్రీధర్ ఎక్స్టెన్షన్ కోసం పెట్టిన రెజల్యూషన్‌ను సెంట్రల్ కోల్ మినిస్ట్రీ ప్రతినిధి వ్యతిరేకించారు. సీఎండీగా శ్రీధర్‌ను కంటిన్యూ చేయడం కేంద్రానికి ఇష్టం లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సాయంతో ఆర్డినరీ రెజ్యులైషన్ పాస్ చేయించుకొని పదవిలో కొనసాగుతున్నారు. రూల్స్‌కు వ్యతిరేకంగా పెట్టిన ఈ తీర్మానం చెల్లదని ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు.
పక్కా ప్లాన్ ప్రకారమే ఆర్డినరీ రెజల్యూషన్..
డిసెంబర్30న కొత్తగూడెంలోని హెడ్ఆఫీస్లో సింగరేణి కాలరీస్ కంపెనీ యాన్యువల్జనరల్బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌కు స్టేట్గవర్నమెంట్ తరపున కంపెనీలోని ముగ్గురు డైరెక్టర్లు, కంపెనీ సెక్రెటరీ, స్టేట్ఎనర్జీ ఆఫీసర్ పాల్గొనగా, కేంద్రం తరుపున సెంట్రల్ కోల్మినిస్ట్రీ నుంచి అండర్ సెక్రెటరీ ఆల్క శేఖర్ హాజయ్యారు. 2019–20 ఫైనాన్షియల్ఇయర్కు సంబంధించి వివిధ అంశాలపై చర్చించాక సీఎండీగా శ్రీధర్ఎక్స్టెన్షన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆర్డినరీ రెజల్యూషన్ పెట్టించింది. ఈ రెజల్యూషన్‌కు కోల్మినిస్ట్రీ ప్రతినిధి ఆల్కశేఖర్ వ్యతిరేకంగా ఓటేసినప్పటికీ కంపెనీలోని ముగ్గురు డైరెక్టర్లు, సెక్రెటరీ, స్టేట్ ఎనర్జీ ఆఫీసర్ సాయంతో పాస్చేయించుకుంది. వాస్తవానికి సీఎండీని ఎక్స్టెన్షన్ చేయాలంటే స్పెషల్ రెజల్యూషన్ పెట్టాలి. అది నెగ్గాలంటే అనుకూలంగా 70శాతం ఓట్లు పడాలి. సెంట్రల్వాటా 49 శాతం కావడంతో, కోల్మినిస్ట్రీ ప్రతినిధి అంతే శాతం ఓట్లతో సమానమైనందున తీర్మానం వీగిపోయినట్లేనని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకవేళ స్పెషల్ రెజల్యూషన్‌ను ఆర్డినరీ తీర్మానంగా మార్చాలంటే14 రోజుల ముందే కోల్ మినిస్ట్రీ నుంచి ఆమోదం తీసుకోవాలి. కానీ ఎలాంటి ఆమోదం లేకుండా పెట్టిన ఆర్డినరీ రెజల్యూషన్ కూడా స్పెషల్ రెజల్యూషన్గానే భావించి సీఎండీ దిగిపోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదీగాక ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ ప్రకారం సీఎండీని కొనసాగించాలాంటే కోల్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్తప్పనిసరి అంటున్నారు. ఇలా సింగరేణి చరిత్రలో ఓ సీఎండీ కొనసాగింపునకు వ్యతిరేకంగా కోల్మినిస్ట్రీ ప్రతినిధి తొలిసారి ఓటేసినా శ్రీధర్ మాత్రంపదవిలో కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి.
గతంలోనే మూడుసార్లు ఎక్స్టెన్షన్..
2015 జనవరి 1న సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ పదవీకాలం నిజానికి 2016 డిసెంబర్ 31నే ముగిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి రెండేళ్ల పీరియడ్‌కు, రెండుసార్లు ఏడాది పీరియడ్‌కు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఐదేళ్లకు మించి ఈ పదవిలో ఉండరాదని రూల్స్ చెబుతున్నాయి. కానీ శ్రీధర్ ఇప్పటికే సీఎండీ పదవిలో ఆరేళ్లపాటు కొనసాగినా, తాజాగా మరోసారి ఎక్స్టెన్షన్ ఇవ్వడాన్ని ఎక్స్పర్ట్స్, ముఖ్యంగా కార్మిక సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. కాగా, సీఎండీ శ్రీధర్ అధికారపార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా వస్తున్నాయి. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో నుంచి కంపెనీకి 10వేల కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉన్నా, వాటిని రాష్ట్రప్రభుత్వం నుంచి ఇప్పించడంలో శ్రీధర్ విఫలమయ్యారనే విమర్శలున్నాయి. డీఎంఎఫ్టీ పేరిట సుమారు రూ.2వేల కోట్లకు పైగా ఫండ్స్‌ను రాష్ట్ర ఖజనాకు మళ్లించారని, తద్వారా కంపెనీకి లాభాలు, దాంతోపాటు తమ వాటాలు తగ్గిపోయాయని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. కొంతకాలంగా కంపెనీలో డీజిల్, ఓబీ కుంభకోణాలు, ఇతరత్రా అవినీతి, అక్రమాలు వెలుగుచూడడంతో కేంద్రం కూడా శ్రీధర్ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది.
ఆత్మగౌరవం ఉంటే రిజైన్ చేయాలి
ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా సింగరేణి సీఎండీ పోస్టుకు శ్రీధర్ రిజైన్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్వద్దని చెప్పినా కుర్చీని పట్టుకొని కదలట్లేదు. రాబోయే సింగరేణి గుర్తింపుసంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను గెలిపించే కుట్రలో భాగంగానే శ్రీధర్‌కు టీఆర్ఎస్ సర్కార్ మళ్లీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. శ్రీధర్ పనితీరు కారణంగానే సింగరేణి క్రమంగా నష్టాల బాటపడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారో సీఎం కేసీఆర్ కే తెలియాలి. -రియాజ్‌అహ్మద్, స్టేట్ ప్రెసిడెంట్, హెచ్ఎమ్మెస్
శ్రీధర్ ఉంటే కేసీఆర్‌కు లాభం
సింగరేణి సీఎండీగా శ్రీధర్ ఉంటే సీఎం కేసీఆర్‌కు చాలా లాభం, స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన రూ. వేల కోట్ల బకాయిలను గట్టిగా అడగలేరు. కంపెనీ ఏమైనాన సరే కేసీఆర్ చెప్పినట్టు తలాడిస్తాడు. అందుకే శ్రీధర్‌ను ఆరేళ్లైనా మరోసారి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దీనిని బట్టి సీఎండీకి, సీఎం కేసీఆర్‌కు మధ్య ఏదో నడుస్తోందని అర్థం చేసుకోవచ్చు. – వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ, సింగరేణి వర్కర్స్ యూనియన్
కేంద్రం సీరియస్‌గా ఉంది
సింగరేణి సీఎండీగా శ్రీధర్ఎక్స్టెన్షన్కు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకో లేదు. ఇటీవల జరిగిన నేషనల్ స్టాండింగ్ కమిటీ సేఫ్టీ మీటింగ్‌లోనూ బీఎంఎస్ లీడర్ లక్ష్మారెడ్డి వ్యతిరేకించారు. శ్రీధర్ స్థానంలో సీఎండీగా మరొకరిని నియమించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. శ్రీధర్ తీరుతో స్టేట్ నుంచి రావాల్సిన కోట్ల బకాయిలు పెండింగ్‌పడ్డాయి. స్పెషల్ రెజ్యులైజేషన్ను ఆర్డినరీ రెజ్యులైజేషన్గా మార్చడంపై కేంద్రం సీరియస్‌గా ఉంది. -పి.మాధవ్ నాయక్, స్టేట్ జనరల్ సెక్రటరీ, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్)