
- 13 మందికి నోటీసులు ఇచ్చి చేతులుదులుపుకున్న ఆఫీసర్లు
- ఆరు నెలలవుతున్నా ఆమోదానికి నోచుకోని ల్యాండ్ కమిటీ రిపోర్టు
- కాగితాలకే పరిమితమైన కాంపౌండ్ వాల్ హామీ
హనుమకొండ, వెలుగు రూ. కోట్ల విలువైన కాకతీయ యూనివర్సిటీ భూములు ఆక్రమణకు గురవుతున్నా ఆఫీసర్లు నిర్లక్ష్యం వీడడం లేదు. భూములు ఆక్రమించి ఇండ్లు కట్టుకున్న వారందరికీ నోటీసులు ఇచ్చిన అధికారులు తర్వాత వాటిని పట్టించుకోవడమే మానేశారు. అలాగే ల్యాండ్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను సైతం ఆరు నెలల నుంచి ఆమోదించకుండా పక్కన పడేశారు. భూముల చుట్టూ కాంపౌండ్ నిర్మిస్తామన్న హామీ కూడా అమలు కాకపోవడంతో ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి.
సగం భూములు కబ్జా ?
కాకతీయ యూనివర్సిటీని 1976లో ఏర్పాటు చేయగా, వర్సిటీ అవసరాల కోసం కుమార్‌పల్లి, లష్కర్ సింగారం, పలివేల్పుల గ్రామాల పరిధిలో 1,018 ఎకరాల భూమిని కేటాయించారు. కేయూ పక్కనే ఉన్న పలివేల్పుల గ్రామ శివారు నుంచి వెళ్లిన ఎస్సారెస్పీ కెనాల్ కోసం 1980లో కొంత భూమి ఇచ్చారు. మిగతా భూమిని రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలివేల్పుల, గుండ్ల సింగారం సమీపంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి. పొలిటికల్ లీడర్లు, ఆఫీసర్ల సపోర్ట్‌తో పెద్దఎత్తున భూములు ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. వీటితో పాటు పోలీస్ స్టేషన్, రేడియో కేంద్రం, జీడబ్ల్యూఎంసీ వాటర్ ఫిల్టర్ బెడ్, విద్యుత్ సబ్‌స్టేషన్ వంటి అవసరాల కోసం కేయూ భూములు తీసుకోవడంతో ప్రస్తుతం వర్సిటీకి 673 ఎకరాలే మిగిలాయి.
నోటీసులకే పరిమితం
కేయూ భూములు అన్యాక్రాంతం అవుతుండడంతో 2021లో వీసీ తాటికొండ రమేశ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కలిసి డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ద్వారా సర్వే చేయించారు. దీంతో 229, 412, 413, 414 సర్వే నంబర్లలోని భూమిని కొందరు ఆక్రమించి ఇండ్లు కట్టుకున్నట్లు తేలింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్‌తో సహా ముగ్గురు ఆఫీసర్లు సైతం భూములు ఆక్రమించి తప్పుడు సర్వే నంబర్లతో పట్టా చేయించుకున్నట్లు ఆఫీసర్ల గుర్తించారు. భూములను ఆక్రమించిన 13 మందికి గతేడాది మార్చిలోనే నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ బిల్డింగ్ పర్మిషన్, రిజిస్ట్రేషన్ పేపర్లు, లింక్ డాక్యుమెంట్లతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కానీ భూములను ఆక్రమించిన వ్యక్తులు ఆఫీసర్లను మేనేజ్ చేయడంతో నోటీసుల విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఆమోదానికి నోచుకోని ల్యాండ్ కమిటీ రిపోర్ట్
డిజిటల్ సర్వే అనంతరం వర్సిటీ భూములు, ఆక్రమణలపై ల్యాండ్ కమిటీ ఆధ్వర్యంలో రిపోర్ట్ తయారు చేశారు. మొదట కమిటీ కన్వీనర్‌గా ఉన్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్‌బాబు పేరు కూడా ఆక్రమణదారుల్లో ఉండడంతో అతడిని ల్యాండ్ కమిటీ నుంచి తొలగించి కన్వీనర్‌గా చంద్రమౌళి, సభ్యులుగా మనోహర్, నాగేంద్రబాబుకు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు రిపర్ట్ రెడీ చేసి గతేడాది నవంబర్‌లోనే పాలకమండలి చైర్మన్, వీసీకి అందజేశారు. ఈ రిపోర్ట్‌ను పాలకమండలి ఎజెండాలో పెట్టి ఆమోదించాల్సి ఉండగా ఆరు నెలలు అవుతున్నా ఆ రిపోర్ట్ ఆమోదానికి చర్యలు తీసుకోవడం లేదు.
కాగితాలకే పరిమితమైన కాంపౌండ్ నిర్మాణం
వర్సిటీ భూముల చుట్టూ కాంపౌండ్ లేకపోవడంతో పలివేల్పుల వైపు 40 నుంచి 50 ఎకరాల వరకు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పటికీ కబ్జాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కేయూ భూముల విషయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కూడా పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు. వర్సిటీ భూములు కాపాడేందుకు కాంపౌండ్ కట్టేందుకు కృషి చేస్తామని చెప్పారు. దీంతో వర్సిటీ చుట్టూ సుమారు 8 కిలోమీటర్ల మేర కాంపౌండ్ అవసరం అని, ఇందుకు రూ. 3 నుంచి రూ. 4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ ఆ ప్రపోజల్ కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వం, ఆఫీసర్లు స్పందించి కేయూ భూములను కాపాడాలని స్టూడెంట్లు కోరుతున్నారు.